Tragedy: చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లెలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా.. విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కొట్టి ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు కాగా.. వారిని కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Also Read: AI: తీవ్ర ప్రమాదంలో మానవుడు.. 5-10 ఏళ్లలో ఏఐ మానవాళిని నాశనం చేయగలదు
శ్మశానవాటిక వద్ద వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యుదాఘాతంతో తిరుపతి, రవీంద్రన్, మునప్ప మృతి చెందినట్లు తెలిసింది. కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి ముగ్గురి మృతదేహాలను తరలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ముగ్గురి ప్రాణాలు పోయాయని.. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ముగ్గురి మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. కుప్పం పురపాలక సంఘం పరిధిలోని తంబిగాని పల్లెకు చెందిన రాణి (65) అనారోగ్యంతో చనిపోగా.. శుక్రవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు అంతిమ యాత్ర చేపట్టారు. శ్మశానం వద్ద విద్యుత్ తీగలు కిందకు ఉండడంతో పాడె మోస్తున్న నలుగురు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన తిరుపతి, మునప్ప, గుంటూరుకు చెందిన రవీంద్రన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.