బీజేపీని గద్దె దించడానికి I.N.D.I.A కూటమి అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఎలా అయినా వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి సర్వ శక్తులు ఒడ్డుతోంది. I.N.D.I.A కూటమి గెలుపొందాలంటే పదవుల కోసం కొట్టుకోకుండా ఐకమత్యంగా ఉండటం అవసరం. ఈ విషయాన్ని గ్రహించిన నేతలు తమకు కేంద్రంలో స్థానం కంటే I.N.D.I.A కూటమి గెలవడమే ముఖ్యమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేంద్రంలో తమకు రాజకీయ స్థానం అవసరం లేదని, ఎన్డీయే కూటమిని ఓడించడమే తమ ధ్యేయమని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో I.N.D.I.A కూటమి విజయాన్ని ఎవరు ఆపలేరని మమత ధీమా వ్యక్తం చేశారు.
ఇక ఈరోజు ఎర్రకోటపై ప్రధానిగా నరేంద్ర మోడీ చేసిన ప్రసంగమే ఆయనకు చివరిది కానుందని ఆమె జోస్యం చెప్పారు. ఇదిలా వుండగా వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశం సాధించిన విజయాలను ఎర్రకోట నుంచి వివరిస్తానని ప్రధాని మోడీ మరోవైపు ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Vishwakarma Yojana: స్వాతంత్ర్యదినోత్సం రోజున వారికి గుడ్ న్యూస్ చెప్పిన మోదీ
ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మౌలిక సదుపాయాల కల్పనలో మోడీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా కాగ్ జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ఇచ్చిన నివేదికను ఖర్గే ప్రస్తావించారు.
విపక్షాల గురించి మాట్లాడే ముందు తమ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మోడీ తెలుసుకోవాలని ఖర్గే హితవు పలికారు. బీజేపీ దోపిడి విధానాలు, అవినీతి దేశాన్ని నాశనం చేస్తున్నాయని ఖర్గే మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే దేశం నరకంలా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.