77 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్రమోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మణిపూర్ లో శాంతి స్థాపన, దేశాభివృద్ధిలో యువత పాత్ర, తమ ప్రభుత్వ ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలు తదితర విషయాల గురించి మోడీ వివరించారు. 10 సంవత్సరాలుగా మోడీ దేశ ప్రధానిగా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
మరోవైపు స్వాతంత్ర దినోత్సవం రోజు సంప్రదాయ కార్మికులు, హస్తకళాకారులకు మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. వారికోసం ‘విశ్వకర్మ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. స్వర్ణకారులు, కమ్మరులు, రజకలు, క్షురకులు, తాపీమేస్త్రీల కోసం వచ్చే కొన్ని రోజుల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు మోడీ వివరించారు.
వీరిలో చాలావరకు ఓబీసీ కేటగిరీ కిందకు వస్తారని తెలిపారు మోడీ. తమ ప్రభుత్వం ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ఆలోచిస్తోందన్న మోడీ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఈ పథకాన్ని సెప్టెంబరు 17న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: PM Modi: ఎర్రకోటపై 10వ సారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ..
వచ్చే ఐదేళ్లలో దేశంలో పేదరికాన్ని నిర్మూలించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశాన్ని అగ్రగామిగా నిలుపుతామని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఇక వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశం సాధించిన విజయాలను ఎర్రకోట నుంచి వివరిస్తానని మోడీ తెలిపారు. అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలిచి తాము విజయకేతనం ఎగురవేస్తామని మోడీ చెప్పకనే చెప్పారు.