రాత్రి సమయాల్లో తాళం వేసివున్న ఇండ్లతో పాటు దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల్లో ఒకరిని గీసుగొండ పోలీసులు సోమవారం అరెస్ట్ చేయగా మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్నాడు అరెస్టు చేసిన దొంగ నుండి ఆరు లక్షల రూపాయల విలువ గల వందగ్రాముల బంగారు, వందగ్రాముల వెండి కారు, ద్విచక్రవాహనం, ల్యాప్ టాప్, ఎల్.ఈ.డి టివి, మూడు సెల్ ఫోన్లతో పాటు పదిహేను వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా, కాశీబుగ్గ ఎస్.ఆర్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ యాకూబ్ పాషా ఆలియాస్ పోలీసులు అరెస్ట్ చేయగా, ఇదే ప్రాంతానికి చెందిన మరో నిందితుడు ఈరెల్లి రఘు ఆలియాస్ కున్ను ప్రస్తుతం పరారీలో వున్నాడు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ ఆటో నడుపుతూ మద్యం జల్సాలకు అలవాటు పడ్డాడు. దీనితో నిందితుడికి ఆటో నడపడం ద్వారా వచ్చే అదాయం తన జల్సాలకు సరిపోకపోవడంతో సులవుగా డబ్బు సంపాదించేందుకు నిందితుడు చోరీల మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడు రాత్రి సమయాల్లో తన ద్విచక్రవాహనం రిజిష్టన్ నంబర్ ప్లెట్ స్థానంలో డాక్టర్, ప్రెస్ లోగోలతో కూడిన నంబర్ ప్లెట్లను మారుస్తూ తాళం వేసిన ఇండ్లతో పాటు, గుళ్ళల్లోని హుండీలోని సొత్తు చోరీ చేసేవాడు. నిందితుడు ఇలా ఒంటరిగా ఎనిమిది చోరీలకు పాల్పడగా చోరీ చేసిన సొత్తును తన ఇంటిలో భద్రపర్చి తన అవసరాల కొద్ది చోరీ సొత్తును అమ్మి సొమ్ము చేసుకోనేవాడు.
ఒంటరిగా చోరీలకు పాల్పడతున్న నిందితుడుకి కాశీబుగ్గ ఎస్.ఆర్ నగర్ నివాసం వుంటున్న తన మిత్రుడు ప్రస్తుతం పరారీలో వున్న నిందితుడు ఈరెల్లి రఘుతో కల్సి మరో నాలుగు చోరీలకు పాల్పడ్డాడు. నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 12 చోరీలకు పాల్పడగా ఇందులో ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ అత్యధికంగా ఆరు చోరీలకు పాల్పడగా గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, సుబేదారి కేయూసి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు ఈస్ట్ జోన్ డిసిపి వెంకటలక్ష్మీ సూచన మేరకు దర్యాప్తు చేపట్టిన గీసుగొండ మరియు సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పోలీసుల వద్ద అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం గొర్రెకుంట ప్రాంతంలో గీసుగొండ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల తన సిబ్బందితో కల్సి తనీఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిందితుడు యాకూబ్ పాషా ద్విచక్రవాహనంపై వస్తుండగా అనుమానంతో పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకోని విచారించగా నిందితుడు పాల్పడిన చోరీలను అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మెరకు నిందితుడి ఇంటి నుండి పోలీసులు మిగితా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన మామూనూర్ ఏసిపి నరేష్ కుమార్, గీసుగొండ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేష్ కుమార్, శ్రీనివాస్, గీసుగొండ ఎస్.ఐ వెంకన్న, గీసుగొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంకట్ రెడ్డి, సారయ్య, దామోదర్, కిషన్ రావు, పవన్ కుమార్ మరియు కిషన్లను వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి అభినందించారు.