Minister Sridhar Babu: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు సభాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పొదుపు సంఘాల చెక్కులను మంత్రులు అందజేశారు. ఇక, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గోదావరి జలాలను ఒక్క బొట్టు కూడా వదులుకోమని తేల్చి చెప్పారు. కేంద్రం ప్రభుత్వంతో చర్చిస్తాం.. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడమన్నారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ ని అసలు ఒప్పుకునేదే లేదని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ కట్టి.. నీళ్లు ఎక్కడికి తీసుకుపోయారో చూసాము.. పక్కనే ఉన్న గోదావరి నీళ్లను ఇక్కడి ప్రజలకి అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
Read Also: YS Jagan: చంద్రబాబు ప్రభుత్వం పోతుంది.. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే!
అలాగే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలను సభలకు బస్సుల్లో తరలించింది అని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. వాళ్లు మహిళలకు చేసింది ఏమీలేదు.. మహిళా స్వయం సహాయక బృందాలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం.. ఒక్క ఏడాదిలో 26 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చాం.. స్కూల్స్ యూనిఫాంలు, మహిళా శక్తి క్యాంటీన్లు, ఆర్టీసీ అద్దె బస్సులను అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీలో అద్దె బస్సులను పెట్టేందుకు మహిళా సంఘాలకు లోన్లు ఇప్పిస్తున్నాం.. విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి కోటి రూపాయలతో ఒక్క మెగావాట్ యూనిట్ సామర్థ్యం ఉన్న ప్లాంట్లను మహిళా సంఘాలకు ఇస్తున్నాం.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో మహిళ సంఘాల పాత్ర కీలకమైంది.. మహిళలను కోటీశ్వరులను చెసేందుకు మేము కట్టిబడి ఉన్నామని శ్రీధర్ బాబు తెలియజేశారు.