తిరుమలలో ఒక వైపు భారీ వర్షం కురుస్తుంటే.. మరో వైపు తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావటంతో స్వామి వారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. దీంతో దర్శనం కోసం కిలో మీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. శిలాతోరణం వరకు దాదాపు మూడు కిలో మీటర్ల మేర భక్తులతో క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. పెగిరిన రద్దీతో టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. దర్శనం కోసం దాదాపు 36 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని టీటీడీ చెబుతున్నారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు కావాల్సిన అన్నప్రసాదం, మంచి నీరు అందిస్తున్నారు.
Also Read : 26/11 Mumbai terror attacks: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణాను భారత్ కు అప్పగించనున్న అమెరికా
భక్తుల రద్దీ వేళ టీటీడీ కీలక సూచనలు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాల లేఖలను తగ్గించాలని తెలిపింది. జూన్ 15వ తేదీ వరకు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది. తాజాగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ నెలా నిర్ణీత తేదీల్లో శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్ణయించింది. ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు అని వెల్లడించింది. 20 నుంచి 22వ తేదీ వరకు డిప్ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. సేవా టికెట్లు లేదా దర్శన టికెట్ల విడుదల తేదీ ఆదివారం వస్తే దాన్ని మరుసటి రోజు విడుదల చేస్తారు.
Also Read : CM JAGAN : గృహనిర్మాణశాఖపై సీఎం జగన్ సమీక్ష
అదే విధంగా ప్రతీ నెల 21వ తేదీన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలతోపాటు వర్చువల్ సేవాటికెట్లను విడుదల చేస్తారు. ప్రతీ నెలా 23వ తేదీన శ్రీవాణి, ఆంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు విడుదల చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 దర్శన టికెట్ల కోటాను 24న, తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ తేదీల్లో భక్తులు సేవా టికెట్లు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇందుకోసం టీటీడీ అధికారిక వెబ్ సైట్ తో పాటుగా యాప్ ధ్వారా బుక్ చేసుకొవచ్చని టీటీడీ తెలిపింది.