మన ఫోన్‌లో కాంటాక్ట్స్‌లో లేని నంబర్ నుంచి కాల్ వస్తే.. ఎత్తాలా వద్దా అని వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం.. ఫోన్ లిఫ్ట్ చేయగానే.. క్రెడిట్ కార్డు కావాలా? లోన్లు కావాలా? ఫ్లాట్ కావాలా? అంటూ ఇలా పదే పదే ఇబ్బందులు పెడుతుంటారు. వద్దనుకుంటుంటే అలాంటి కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. చాలా మందిని ఈ సమస్య వేధిస్తుంటుంది. రోజులో పదుల సంఖ్యలో ఇలాంటి కాల్స్ వస్తాయి. మనం అప్పుడు ఏదైనా పనిలో ఉన్నప్పుడు.. ఇలాంటి కాల్స్ వస్తే.. కోపం, చిరాకు వస్తాయి. ఇలాంటి కాల్స్‌ను నియంత్రించే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడట్లేదు. అందుకే ఇప్పుడు స్వయంగా కేంద్రం రంగంలోకి దిగింది. వీటికి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఇలాంటి అవాంఛిత కాల్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం గురువారం ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.
READ MORE: NET-NEET Paper Leak : నెట్-నీట్‌లో అవకతవకలపై దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనున్న కాంగ్రెస్
కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన ముసాయిదా ప్రకారం.. ఎవరైనా వ్యాపార ప్రమోషన్ లేదా ఏదైనా అమ్మకానికి సంబంధించిన కాల్‌లను స్వీకరించడానికి వినియోగదారుడు పర్మిషన్ తప్పనిసరి చేసింది. వినియోగదారుని అనుమతి లేకుండా అతను అలాంటి కాల్‌లు మరియు సందేశాలను స్వీకరిస్తే అది అవాంఛిత వ్యాపారంగా పరిగణించబడుతుంది. కాలింగ్ ఎంటిటీ లేదా వ్యక్తి దీనికి బాధ్యత వహించాలి. నమోదుకాని టెలిమార్కెటర్ల నుంచి లేదా 10-అంకెల ప్రైవేట్ నంబర్‌ల నుంచి అవాంఛిత కాల్‌లను నిరోధించడం ప్రతిపాదిత మార్గదర్శకాల ఉద్దేశం. వస్తువులు, సేవలకు సంబంధించిన ఏదైనా ప్రచార కాల్ లేదా సేవా సందేశం వ్యాపార కమ్యూనికేషన్‌గా కిందికి వస్తుందని డ్రాఫ్ట్ పేర్కొంది. వ్యక్తి గత కమ్యూనికేషన్ దానికి దూరంగా ఉంచనుంది. ఆ కాల్స్ పై వినియోగదారుడి అంగీకారం తప్పనిసరి చేయనుంది. TRAI సూచనల తర్వాత కూడా అవాంఛిత కాల్‌ల సమస్యను దృష్టిలో ఉంచుకుని, మంత్రిత్వ శాఖ, టెలికాం కంపెనీలతో సహా సంబంధిత అన్ని పార్టీలతో చర్చించింది. అనంతరం ఈ ముసాయిదా మార్గదర్శకాలను సిద్ధం చేసింది. వీటిపై జూలై 21 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను కోరనుంది.