తెలంగాణ రాష్ట్ర నీటి ప్రయోజనాలను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తన అభ్యంతరాలను అత్యున్నత న్యాయస్థానంలో బలంగా వినిపించబోతోందని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు ఈ అంశంపై ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తూ, సుప్రీంకోర్టు స్వయంగా ఇచ్చిన సూచనల మేరకు ఆర్టికల్ 131 కింద త్వరలోనే సివిల్ సూట్ దాఖలు చేస్తామని మంత్రి ప్రకటించారు. సాధారణంగా ఆర్టికల్ 32 కింద వేసే పిటిషన్ల కంటే, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకు ఆర్టికల్ 131 కింద దావా వేయడమే సరైన మార్గమని కోర్టు అభిప్రాయపడిందని, దీని ద్వారా ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడం సులభతరం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Supreme Court: రూ.2,742 కోట్ల స్కామ్‌పై దాడులు.. మమతపై సుప్రీంకోర్టులో ఈడీ ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాల వినియోగంలో తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గోదావరి బేసిన్లో ఏపీకి కేవలం 484 టీఎంసీల కేటాయింపులు మాత్రమే ఉన్నాయని, అంతకు మించి ఒక్క చుక్క నీటిని అదనంగా వాడుకున్నా అది అంతర్రాష్ట్ర ఒప్పందాలను , ట్రిబ్యునల్ కేటాయింపులను ధిక్కరించడమే అవుతుందని హెచ్చరించారు. వరద జలాల పేరుతో అదనపు నీటిని తరలించే హక్కు ఏపీకి లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక నిబంధనలను ఏపీ సర్కార్ తుంగలో తొక్కిందని, కేంద్రం ఇచ్చిన ‘స్టాప్ వర్క్’ ఆర్డర్లను సైతం అమలు చేయకుండా మొండిగా పనులు కొనసాగిస్తోందని మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు లేని పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను కాపాడుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏపీ ప్రభుత్వం కావాలనే అడ్డంకులు సృష్టిస్తోందని, మరోవైపు తాము మాత్రం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతోందని విమర్శించారు. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న ప్రతిపాదనకు తాము సానుకూలంగానే ఉన్నప్పటికీ, అనుమతులు లేని ప్రాజెక్టుల విషయంలో మాత్రం న్యాయపోరాటం తప్పదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ రైతాంగం , భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏపీ అక్రమ నిర్మాణాలను అడ్డుకునే వరకు విశ్రమించబోమని ఆయన స్పష్టం చేశారు.