Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు తెలంగాణ పోలీసుల షాక్‌.. నో పర్మిషన్..

Pawankalyan

Pawankalyan

Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఓ రకంగా షాకిచ్చారు తెలంగాణ పోలీసులు.. హైదరాబాద్‌లో నిర్వహించనున్న జనసేన పార్టీ ‘నవనిర్మాణ సంకల్ప సభ’కు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు.. దీంతో, ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ పాల్గొననున్న ఈ సభను గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. తెలంగాణలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జనసేన నాయకత్వం ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ’ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభలో పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. అంతేకాకుండా జనసేన సాధక్ సమ్మేళనాన్ని కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే, ఈ సభకు అనుమతి కోరుతూ జనసేన పార్టీ చేసిన దరఖాస్తును తెలంగాణ పోలీసులు తిరస్కరించినట్లు సమాచారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, అలాగే శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ప్రస్తుతం సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసుల నిర్ణయంపై జనసేన నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా సభ నిర్వహించుకునే హక్కు తమకు ఉందని, అవసరమైన అన్ని నిబంధనలను పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. సభకు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని జనసేన నిర్ణయించింది.

×
×
Ad

ఈ నేపథ్యంలో సభ నిర్వహణపై తుది నిర్ణయం కోర్టు తీర్పుపై ఆధారపడి ఉండనుంది. జనసేన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కోర్టు అనుమతి లభిస్తే సభ యథావిధిగా నిర్వహించే అవకాశాలు ఉండగా, లేకపోతే పార్టీ తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో పార్టీ విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్న జనసేనకు ఈ పరిణామం కీలకంగా మారింది. మరోవైపు పవన్ కల్యాణ్ సభ నిర్వహణపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.