Konda Surekha : తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను తెలుసుకోవడానికి బీఆర్ఎస్ భయపడుతోందని, ప్రజల ముందు తాము చేసిన తప్పులు బయటపడుతాయనే భయంతోనే అసలు విషయాలను దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో అడ్డుపడుతూ బీఆర్ఎస్ సభ్యులు అనవసరంగా అర్ధాంతరంగా వ్యవహరించడం సబబు కాదని, ప్రజలు ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నారని అన్నారు.
“బీఆర్ఎస్ సభ్యులు నిజాలను తెలుసుకోవాలంటే భయపడుతున్నారు. వారికీ వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకే అసలు విషయాలను వినకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు,” అని కొండా సురేఖ అన్నారు. “సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించడం సరైంది కాదు. నిరసన తెలుపాలంటే వాకౌట్ చేసి వెళ్లాలి, కానీ సభలోనే అరుస్తూ నినాదాలు చేయడం అసంబద్ధం. ఇది అసలు ప్రజాస్వామ్యానికి తగిన విధానం కాదు.” అని ఆమె అన్నారు.
అంతకుముందు, సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలిలో ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విస్తృతంగా నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక విషయాలను ప్రజలకు వివరించేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన ప్రసంగానికి అడ్డు తగిలేందుకు బీఆర్ఎస్ సభ్యులు ప్రయత్నించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
“నిజాలను దాచిపెట్టాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారు. సభను అడ్డుకునే ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు,” అని కొండా సురేఖ హెచ్చరించారు. “ఇకనైనా బీఆర్ఎస్ సభ్యులు తమ వైఖరిని మార్చుకోవాలి. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ సభా విధులను కాపాడాలి.” అని ఆమె అన్నారు.
Kannappa: కన్నప్ప స్వగ్రామంలోని శివాలయాన్ని సందర్శించిన విష్ణు మంచు