Telangana SC Classification: తెలంగాణ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమానికి ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, మొత్తం 56 ఎస్సీ కులాలను మూడు విభాగాలుగా వర్గీకరించింది. మూడు గ్రూపులుగా విభజన, రిజర్వేషన్ల కేటాయింపు వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రూప్-A లో అత్యంత వెనుకబడిన కులాలకు 1 శాతం రిజర్వేషన్, గ్రూప్-B లో మధ్యస్థ లబ్దిదారులకు 9 శాతం రిజర్వేషన్, గ్రూప్- Cలో మెరుగైన స్థితిలో ఉన్న కులాలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఈ విధంగా మొత్తం 15 శాతం రిజర్వేషన్లను వర్గీకరించిన రూపంలోనే కొనసాగించనున్నారు. ఈ వర్గీకరణ సామాజిక న్యాయానికి, సమతా స్థాపనకు దోహదపడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన పోరాటానికి నేడు తీర్పు లభించింది. ఇది బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగడంలో ముఖ్యమైన అడుగు” అని అన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో పేదలకు మెరుగైన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం చురుకుగా పనిచేస్తుందని తెలిపారు.
అలాగే, ప్రభుత్వం చేపట్టిన పలు ప్రజాహిత పథకాలపై ఆయన వివరించారు. యంగ్ ఇండియా స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. రైతులు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేలు ఆర్థిక భరోసాగా అందిస్తున్నామని తెలిపారు. పేదల ఆత్మగౌరవ ప్రతీకగా “ఇందిరమ్మ ఇళ్లు” పథకాన్ని ప్రారంభించామని, భూమిపై హక్కుల కోసం “భూభారతి” పథకానికి శ్రీకారం చుట్టామని వివరించారు. ఈ నిర్ణయాలు తెలంగాణలోని ఎస్సీ వర్గాలకు సామాజిక, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రగతిపథంలో ముందడుగు వేయడం అని ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.