Case Filed on BRS Candidate Padi Koushik Reddy: హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు రోజైన మంగళవారం కౌశిక్ రెడ్డి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలపై కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కమలాపూర్ ఎంపీడీవో ఫిర్యాదు మేరకు.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Rahul Dravid-BCCI: నెహ్రా వద్దన్నాడు.. రాహుల్‌కు బీసీసీఐ మరో ప్రతిపాదన!
హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) విచారణకు ఆదేశించింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపి.. నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్ ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. మంగళవారం జరిగిన ప్రచారంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మీకు దండం పెడతా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నేను చేయాల్సిన ప్రచారం చేశా.. ఇక సాదుకుంటరో, సంపుకుంటరో మీ ఇష్టం. ఓట్లేసి గెలిపిస్తే నాలుగో తారీఖున నేను విజయయాత్ర వస్తా.. లేకపోతే నా శవయాత్రకు మీరు రండి. నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించుకోండి’ అంటూ ఓటర్లను అభ్యర్థించారు.