Addanki Dayakar: తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వస్తున్న విమర్శలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తీవ్రంగా స్పందించారు. హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ నాయకులు విమర్శలకు తప్ప దేనికీ పనికిరారని ప్రజలకు అర్థమైందని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల హయాంలో రైతులు ఎన్నో గడ్డు రోజులు ఎదుర్కొన్నారని అన్నారు. ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతు ఋణమాఫీ, రైతు భరోసా పథకాలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలోకి ఎక్కిందని దయాకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి రైతుల పట్ల ఎంత కట్టుబడి ఉన్నారో ఈ చర్యలు ప్రూవ్ చేశాయని అన్నారు. అన్ని పంటలకు బోనస్, రైతు భీమా, నష్టపరిహారం అందించడమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని ఆయన అన్నారు.
Also Read: CM Revanth Reddy: ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చాం
బీఆర్ఎస్, బీజేపీలకు రైతుల సంక్షేమం గురించి పట్టించుకునే ఆలోచన లేకుండా, వారు రైతులను దోచుకున్న చరిత్ర మాత్రమే ఉందని దయాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పేరుతో చెట్లకు, పుట్టలకు, ఫిల్మ్ సిటీలకు 20 వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ధనాన్ని దోచుకున్న దొంగలు ఒకవైపు, రాష్ట్రానికి చిల్లిగవ్వ కూడా ఇవ్వని కేంద్ర ప్రభుత్వ దొంగలు మరోవైపు మాట్లాడుతున్నారని దయాకర్ అన్నారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, రైతు భరోసా పథకం ద్వారా రైతులకు భరోసా కల్పిస్తున్నామని అన్నారు. రైతులు సంతోషంగా ఉన్న సమయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై అనవసర విమర్శలు చేసే ప్రతి పక్షాలను ప్రజలు తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అద్దంకి దయాకర్ ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.