CM Revanth Reddy meeting with Collectors and SP’s Today: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నేడు జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సీఎం మాట్లాడనున్నారు. ధరణి సమస్యలు, మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు, ప్రజావాణి విజ్ఞప్తులు, దరఖాస్తులు, గ్రామ సభలు.. మొదలైన వాటిపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
సీఎంగా పదవీ భాద్యతలు చేపట్టిన మొదటిరోజు నుంచే ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్లోని మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్లో ప్రతి మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమంను సీఎం నిర్వహిస్తున్నారు. ఈ ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ల సమావేశంలో నేడు సీఎం ప్రకటించనున్నారు. అంతేకాకుండా ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వనున్నారు.
Also Read: Indira Canteen: ప్రయాణికులకు శుభవార్త.. రూ.10కే భోజనం, రూ. 5 లకు అల్ఫాహారం!
నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ పథకాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్లేందుకై ప్రభుత్వ పనితీరును మరింత మెరుగు పర్చడం, జవాబుదారిగా ఉండేందుకై ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఆహ్వానించారు. డిసెంబర్ 28వ నుంచి జనవరి 6వ తేదీ వరకు (సెలవు రోజులు మినహాయించి మొత్తం 8 పనిదినాలు) గ్రామ సభలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయితీలు, మున్సిపల్ వార్డులలో రోజుకు రెండు చొప్పున సభలు నిర్వహించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు.