CM Revanth Reddy : తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శ్రీరాం సాగర్, నాగార్జున సాగర్, కోయిల్ సాగర్, మంజీరా గడ్డపై సాగునీటి ప్రాజెక్టులపై ఎవరి వద్ద అయినా మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
హరీష్ రావును ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యంగ్యంగా స్పందించారు. పిల్ల కాకులకేం తెలుసు… వాళ్లు వీళ్లు కాదు, కేసీఆర్ నువ్వే రా అంటూ కౌంటర్ ఇచ్చారు. 2023లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని, ప్రజల తీర్పుతో కేసీఆర్‌కు సరైన దెబ్బపడిందని అన్నారు.
కేసీఆర్ ప్రజల్లోకి రాలేకపోవడాన్ని విమర్శిస్తూ, అధికారం లేకపోతే బయటకు రావడం లేదా? అని ప్రశ్నించారు. తన బదులుగా కొడుకు, అల్లుడిని ముందుకు నెడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీకి హాజరుకాకపోయినా ప్రతిపక్ష హోదా ఎందుకు? జీతభత్యాలు ఎందుకు? అని నిలదీశారు.
క్యాప్సికం సాగు చేస్తే కోట్లు వస్తాయని చెప్పిన కేసీఆర్, ఆ టెక్నిక్ ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. నీ లక్ష కోట్ల సంపాదన నైపుణ్యం ఏంటో చెప్పాలని సవాలు విసిరారు. వెయ్యి మంది యువకులను నీ ఫామ్ హౌస్‌కు పంపిస్తా, వారికి నీ సంపాదన రహస్యాలు నేర్పించు అంటూ ఎద్దేవా చేశారు.
కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా కొనియాడే వారి మాటలను తప్పుబడుతూ, తెలంగాణ జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ మాత్రమే అని స్పష్టం చేశారు. లక్ష కోట్లు దోచుకున్నోడు, తాగుబోతు, తెలంగాణ ప్రజల రక్తం పీల్చినోడు తెలంగాణ జాతిపిత కాలేడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
CM Revanth Reddy : అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా మొత్తం చిట్టా విప్పుతా