Telangana BJP President Ramchander Rao House Arrest: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నేడు బంజారాహిల్స్ పెద్దమ్మ టెంపుల్‌కి వెళ్తారనే సమాచారంతో రామచందర్ రావును ముందస్తుగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొన్ని రోజుల క్రితం ఓ దుండగుడు పెద్దమ్మ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో వివాదం నెలకొంది. నేడు పెద్దమ్మ టెంపుల్‌లో బీజేపీ నేతలు కుంకుమార్చన చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ముందస్తుగా హౌస్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామచందర్ రావు ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. షెడ్యూల్ ప్రక్రారం.. నేడు లాలాపేటలో, గోషామహల్ నియోజకవర్గంలో తిరంగా యాత్రలో ఆయన పాల్గొనాల్సి ఉంది.
Also Read: Telangana Rains Today: నేడు తెలంగాణలో భారీ వర్షం.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
రామచందర్ రావు హౌస్ అరెస్టుపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి స్పందించారు. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు ఇంటిని పోలీస్ యంత్రాంగం అకారణంగా దిగ్బంధనం చేసింది. గృహనిర్బంధనం చేస్తున్న కారణం సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపక్ష పార్టీల నాయకులను నిర్బంధించడం మానుకోవాలి. నిర్బంధాలతో కార్యక్రమాలను అడ్డుకోవాలని చూడడం దురదృష్టకరం. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా గృహనిర్మాంధాలు, ముందస్తు అరెస్టులు చేయడం పరిపాటిగా మారింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావులేదు. రాంచందర్ రావు ఇంటి నుంచి వెంటనే పోలీసులు వెళ్లిపోవాలి. ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను బీజేపీ చేపడుతుంది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ హార్ ఘర్ తిరంగా యాత్రలను చేపట్టింది. ఈ తిరంగా యాత్రలో రాష్ట్ర అధ్యక్షులు సికింద్రాబాద్, గోషామాల్ నియోజకవర్గంలో పాల్గొనవలసింది ఉంది’ అని మనోహర్ రెడ్డి అన్నారు.