Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు, మైనార్టీల స్థానం, విద్యుత్ సబ్సిడీలు, రైతుల సంక్షేమం, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు రాజకీయంగా ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42% గా ప్రకటించడం రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగినదని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు ఎవరూ చేయలేని విధంగా ఈ బిల్లును తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. అలాగే, EWS రిజర్వేషన్లు 50% పైగా ఉండగా, బీసీ రిజర్వేషన్ ఆగుతుందనే మాట తప్పుడు ప్రచారం మాత్రమే అని స్పష్టం చేశారు.
“బీసీ జనాభా లెక్కలు చక్కగా నిర్వహించేందుకు డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. అన్ని అంశాలను చట్టబద్ధంగా అమలు చేస్తున్నాం” అని మంత్రి వివరించారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణంపై మాట్లాడిన ఆయన, “మహిళలు అవసరమైతేనే బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సబ్సిడీ వల్ల ప్రభుత్వ ఖజానాకు భారమేమీ కలుగదు” అని పేర్కొన్నారు. 200 యూనిట్ల విద్యుత్ ఉచిత పథకం పేదలకు ఎంతో మేలు చేస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ చెల్లింపులో పేదలపై ఉన్న భారాన్ని ప్రభుత్వం తగ్గించిందని తెలిపారు.
“బీజేపీ నాయకులు మైనారిటీలను బీసీలలో చేర్చారని విమర్శలు చేస్తున్నారు. కానీ, అదే బీజేపీ ఏపీలో అధికారంలో ఉంది. అక్కడ ఎందుకు మైనారిటీలను బీసీల్లో చేర్చారు?” అని ప్రశ్నించారు. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు నిరాధారమైనవని మంత్రి అభిప్రాయపడ్డారు. “ప్రభుత్వం తరపున మేము ప్రధానిని అపాయింట్‌మెంట్ కోరాము. కానీ బీజేపీ నేతలు మమ్మల్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తమదే” అని అన్నారు.
తెలంగాణ రైతుల సమస్యల గురించి మాట్లాడిన మంత్రి, “పంటలు ఎండిపోతే బీఆర్‌ఎస్ నేతలు సంతోషపడుతున్నారు” అని ఆరోపించారు. అన్ని ప్రాజెక్టుల కింద నీటిని అందించగలగడం సాధ్యం కాదని, రైతులకు అనుకూలంగా పనిచేయడానికి ప్రభుత్వ విధానాలు మారుతున్నాయని తెలిపారు.
“42% బీసీ రిజర్వేషన్ మొదటి అడుగు. రెండో అడుగు బీసీ సబ్ ప్లాన్ – దాని కోసం ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశాం” అని వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న “మిస్ ఇండియా” అందాల పోటీకి 250 కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తోందని వస్తున్న ఆరోపణలపై మంత్రి స్పందించారు. “ప్రభుత్వం నుండి డబ్బులు అందాల పోటీకి ఖర్చు చేయడం లేదు. అసలు కేటీఆర్ లాంటి అందగాడు ఉన్న రాష్ట్రంలో అందాల పోటీలు ఎందుకు?” అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. కేటీఆర్‌పై మరింతగా విమర్శలు గుప్పిస్తూ, “ఫార్ములా ఈ రేసింగ్‌కి, అందాల పోటీకి పోలికలా? కేటీఆర్‌కి అసలు ఈ విషయాలు తెలుసా?” అని ప్రశ్నించారు.