Hyderabad: తెలంగాణ దేశంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. తక్కువ కాలంలోనే వస్తు, సేవల పన్ను విషయంలో చెప్పుకోదగ్గ వృద్ధిని సాధించింది. నాలుగేళ్లలో జిఎస్‌టి వసూళ్లలో రాష్ట్రం 69 శాతం వృద్ధి రేటును సాధించడం ద్వారా ఇది స్పష్టమవుతోంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కి సమర్పించిన తాజా నివేదిక ప్రకారం, తెలంగాణ జిఎస్‌టి ఆదాయం 2018-19లో రూ. 28,786 కోట్ల నుండి 2022-23 నాటికి రూ. 41,889 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు రూ. 13,103 కోట్ల వసూళ్లను పెంచుకుంది.
COVID-19 మహమ్మారి ప్రపంచం మొత్తం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, తెలంగాణ GST వసూళ్లలో ఆశాజనక ధోరణిని కొనసాగించగలిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం GSTని ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణకు GST ఆదాయంలో రూ. 28,786 కోట్లు వచ్చాయి. తెలంగాణ బడ్జెట్ అంచనా రూ. 34 వేల 232 కోట్లుగా ఉండగా అందులో 84 శాతం సాధించింది. ప్రపంచమంతా మహమ్మారి ప్రతికూల ప్రభావంతో కొట్టుమిట్టాడుతుండగా, లాక్‌డౌన్‌ల సమయంలో కూడా తెలంగాణ తదుపరి సంవత్సరాల్లో వృద్ధి పథంలో కొనసాగింది.
Read Also:Telangana Elections :తెలంగాణ సాధారణ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న ఎన్నికల కమిషన్..
2019-20లో అంచనా వసూళ్లు రూ.31,186 కోట్లు కాగా, బడ్జెట్ అంచనాల్లో 90 శాతం వాటాతో తెలంగాణ రూ.28,053 కోట్లు వసూలు చేయగలిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 32,671 కోట్ల అంచనా కాగా 80 శాతం అంచనాలను అందుకుంటూ రూ. 25,905 కోట్ల సేకరణ జరిగింది. 2021-22లో రాష్ట్రం రూ. 35,520 కోట్లు అంచనా వేయగా రూ.34,489 కోట్లు వసూలు చేసింది. 2022-23 లో అంచనా వసూళ్లు రూ. 42 వేల 189 కోట్లు కాగా అది 90 శాతం సాధిస్తూ రూ. 41, 889 కోట్లకు చేరింది.
GST వసూళ్లలో తెలంగాణ స్థిరమైన వృద్ధికి సీఎం కేసీఆర్ సర్కార్ అమలు చేసిన బలమైన ఆర్థిక ప్రణాళిక, విధానాలే కారణమని చెప్పవచ్చు. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రం గణనీయమైన మార్పులకు గురైంది. మెరుగైన ఆర్థిక పరిస్థితుల కారణంగా పౌరుల కొనుగోలు శక్తి పెరిగింది. తద్వారా వ్యాపార రంగం వృద్ధి చెందుతూ జిఎస్‌టి రాబడి పెరగడానికి దోహదపడిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్ని సవాళ్లు ఎదుర్కున్నా తెలంగాణ తన కాళ్లపై బలంగా నిలబడి ఆర్థిక శక్తిగా ఎదిగింది. పటిష్టమైన ఆర్థిక వ్యూహంతో, ఆర్థిక వనరుల సమర్ధవంతమైన వినియోగంతో రాష్ట్రం ఇతరులకు ఆదర్శంగా నిలిచింది.
ఈ అద్భుతమైన ఫలితాలను సాధించడంలో వాణిజ్య పన్నుల శాఖ కీలక పాత్ర పోషించింది. కొత్త సర్కిళ్ల స్థాపన, ప్రతి స్థాయిలో స్పష్టమైన లక్ష్యాలు, మాన్యువల్ నోటీసులు, ప్రొసీడింగ్‌ల రద్దుతో సహా వివిధ సంస్కరణలు పన్ను ఆదాయంలో గణనీయమైన వృద్ధికి దోహదపడ్డాయని అధికారులు తెలిపారు. తెలంగాణ అసాధారణ పనితీరు గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షించింది. వారు వాణిజ్య పన్నుల శాఖ అమలు చేసిన సంస్కరణలను అధ్యయనం చేయడానికి వచ్చారు. ఆర్థిక ప్రణాళిక, సంస్కరణలకు రాష్ట్రం చురుకైన విధానం స్థిరమైన వృద్ధికి మార్గం సుగమం చేసింది. ఇతర రాష్ట్రాలు అనుకరించటానికి తెలంగాణను ఒక నమూనాగా చూపించే స్థాయికి చేరుకుంది.
Read Also:Koppula Eshwar: అడ్లూరిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం.. మంత్రి హెచ్చరిక