Yuzvendra Chahal On His Bond With MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఎందరో యువ ప్లేయర్స్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, సురేష్ రైనా లాంటి ఆటగాళ్లు ధోనీ సారథ్యంలోనే స్టార్ ప్లేయర్లుగా ఎదిగారు. ధోనీ సూచనలు, సలహాలు తీసుకుని ఎదిగిన యువకులు ఇప్పుడు భారత జట్టులో కీలకంగా ఉన్నారు. అందులో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఒకడు. మహీ కెప్టెన్సీలో యూజీ వన్డేల్లో అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలో సమయం, సందర్భం దొరికినప్పుడల్లా ధోనీపై చహల్ తన అభిమానం చాటుకుంటూనే ఉన్నాడు.
యుజ్వేంద్ర చహల్ తాజాగా ఎంఎస్ ధోనీతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్‌లో తన చేష్టలతో సహచరులను ఆటపట్టించే చహల్.. ధోనీ ఎదురుపడితే మాత్రం సైలెంట్ అవుతాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. తాజాగా చహల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘కేవలం ఎంఎస్ ధోనీ ముందు మాత్రమే నేను సైలెంట్‌గా ఉంటా. మహీ నా ముందుకు వచ్చేసరికి నా నోరు ఆటోమేటిక్‌గా మూతపడుతుంది. అనవసర విషయాలు మాట్లాడను. మహీ భాయ్ ముందు కూర్చుని కేవలం అతడు అడిగిన వాటికి మాత్రమే సమాధానం ఇస్తా. లేకపోతే నిశ్శబ్దంగా ఉంటా’ అంటూ తెలిపాడు.
Also Read: iPhone 13 Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ. 21 వేలకే ఐఫోన్ 13! డోంట్ మిస్ ది ఛాన్స్
గతంలో సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 64 పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. ఎంఎస్ ధోనీ తనపై ఎంతో నమ్మకముంచాడని యుజ్వేంద్ర చహల్ తెలిపాడు. ‘దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్ ఆడుతున్నాం. నేను వేసిన 4 ఓవర్లలో 64 రన్స్ బాదారు. హెన్రిక్ క్లాసెన్ నా బౌలింగ్‌లో భారీగా పరుగులు చేశాడు. వెంటనే ఎంఎస్ ధోనీ నా వద్దకు వచ్చి రౌండ్ ది వికెట్ వేస్తావా అని అడిగాడు. నేను అలానే చేశాను. అయినా కూడా క్లాసెన్ సిక్స్ బాదాడు. మళ్లీ ధోనీ నా వద్దకు వచ్చి ఈరోజు నీది కాదు అంటూ నా భుజం తట్టాడు. మిగిలిన ఐదు బంతుల్లో బౌండరీలు ఇవ్వకుండా చూసుకో అని చెప్పి వెళ్లాడు. అప్పుడు నాకు ఓ విషయం తెలిసింది. నాది కాని రోజున కూడా నాకు జట్టు నుంచి మద్దతు లభిస్తుందని’ అని ధోనీ కెప్టెన్సీపై యూజీ ప్రశంసలవర్షం కురిపించాడు.
Also Read: Dwayne Bravo Six: డ్వేన్ బ్రావో భారీ సిక్సర్.. వీడియో చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!