Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికార వైసీపీ ఓడించాలనే లక్ష్యంతో ఇరు పార్టీలు జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలోనే సీట్లు దక్కని నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రోజంతా బుజ్జగింపులతో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు. కొందరు నేతలకు హామీలు, మరి కొందరి నేతలకు టీడీపీ అధినేత స్పష్టత ఇచ్చారు. ఆలపాటి రాజా, పీలా గోవింద్, దేవినేని ఉమా, బొడ్డు వెంకట రమణ చౌదరి, గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, అయ్యన్న, ముక్కా రూపానంద రెడ్డిలు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. వారందరికి చంద్రబాబు హామీలు ఇచ్చినట్లు తెలిసింది.
Read Also: Prahlad Joshi: ఇండియా 3వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా మారబోతోంది..
గంటా శ్రీనివాసరావుకు చీపురుపల్లి నుంచే పోటీ చేయాల్సి ఉంటుందని చంద్రబాబు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. విశాఖ సౌత్ నుంచి గండి బాబ్జీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమంటూ నమస్కారం చేసి దేవినేని ఉమ వెళ్లారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఆలపాటి రాజా, బొడ్డు వెంకట రమణ చౌదరి సంతృప్తితో వెళ్లారు. ఆలపాటి రాజాకు సముచిత న్యాయం జరుగుతుందని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది. రాజమండ్రి ఎంపీ సీటును బీజేపీ అడగకుంటే ఆ స్థానం నుంచి బొడ్డు పేరును పరిశీలిస్తామని చంద్రబాబు తెలిపినట్లు సమాచారం. పీలా గోవిందును చంద్రబాబు ఇంటికి వెంటపెట్టుకొచ్చారు అయ్యన్నపాత్రుడు. చంద్రబాబుతో భేటీ తర్వాత కూడా అసంతృప్తిగానే పీలా గోవింద్ వెళ్లినట్లు తెలిసింది. రాజంపేట టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబును ముక్కా రూపానంద రెడ్డి కోరారు.