Atchannaidu: తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి సొమ్ము అంటున్నారు.. విరాళాలు బహిర్గతం చేసేందుకు మేం సిద్ధం.. మీరు సిద్ధమా అంటూ సవాల్ చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయంలో లైట్లు ఆర్పి కొవ్వొత్తులు, కాగడాలు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు నేతలు.. పార్కింగ్ ఏరియాలో కార్ల లైట్లు బ్లింక్ కొడుతూ చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహన్, దేవినేని ఉమ, నక్కా ఆనంద్ బాబు, పీతల సుజాత, అశోక్ బాబు, పంచుమర్తి అనురాధ, జీవీ ఆంజనేయులు, వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇక, ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎలాంటి ఆధారాల్లేకుండా చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారని.. ఈ 29 రోజులుగా ఏం పీకారు? అంటూ మండిపడ్డారు. రూ 3300.కోట్ల అవినీతి ఆరోపణల నుంచి రూ. 370 కోట్లు అని ఇప్పుడు.. రూ. 27 కోట్లు అంటున్నారని దుయ్యబట్టారు.. తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి సొమ్ము అంటున్నారు. విరాళాలు బహిర్గతం చేసేందుకు మేం సిద్ధం అన్నారు. అయితే, స్కిల్ కేసులో సంబంధo ఉన్నవారెవ్వరు పార్టీకి పైసా విరాళం కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. క్విడ్ ప్రోకో ద్వారా విరాళాలు సేకరించింది వైసీపీనే అంటూ ఆరోపణలు గుప్పించారు. పంచభూతాలను దోచుకున్న జగన్ అవినీతి సామ్రాట్టుగా ఎదిగాడు అని ఆరోపించారు అచ్చెన్నాయుడు.
ఈ నిరసన వేడి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాకేలా ప్రజలు స్పందించారని తెలిపారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మల రామానాయుడు.. వైఎస్ జగన్ అవినీతి, అక్రమ పాలనను ప్రశ్నించారనే అక్రమ కేసులో చంద్రబాబుని జైలుకు పంపారని విమర్శించారు. ఇక, అరచేతితో తెలుగుదేశం ప్రభంజనం ఆపడం వైఎస్ జగన్ తరం కాదన్నారు టీడీపీ సీనియర్ నేత జీవీ ఆంజనేయులు.. సెక్షన్ల 144లు, సెక్షన్ 30యాక్టులు ఇంకెన్ని నెలలు పెడతారు..? అని మండిపడ్డారు. జగన్ చేసిన రూ.3.30 లక్షల కోట్ల అవినీతి పేదలకు పంచితే, ప్రతీ ఒక్కరికీ రూ. 10 లక్షలు అందుతాయన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే సమాధి కడతారని హెచ్చరించారు జీవీ ఆంజనేయులు.