ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం అనర్హత పిటిషన్లపై విచారణ చేయనున్నారు. ఈ సందర్భంగా అమరావతికి నెల్లూరు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు చేరుకున్నాయి. అనర్హత పిటిషన్ పై స్పీకర్ తో విచారణకు హాజరయ్యే అంశంపై వైసీపీ రెబెల్స్ తర్జన భర్జన పడుతున్నారు. విచారణకు హాజరయ్యే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నారు. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని ఇప్పటికే స్పీకర్ ఆఫీసుకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లేఖ రాశారు. ఇక, న్యాయ నిపుణులతో సంప్రదించాకే విచారణకి వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై వైసీపీ రెబెల్స్ నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, న్యాయ నిపుణులతో టీడీఎల్పీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి సంప్రదింపులు జరుపుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు హాజరు కావాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవిలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు.
Read Also: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్!
కాగా, స్పీకర్ ముందు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల హాజరుపై ఉత్కంఠత కొనసాగుతుంది. విచారణకు నలుగురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరాం హాజరు కావాల్సి ఉంది. అయితే, తమకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ముగ్గురు ఎమ్మెల్యేలు వంశీ, వాసుపల్లి, బలరాం హాజరు కానున్నారు. ఇక, విదేశీ పర్యటనలో ఉన్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి మాత్రం.. ఇవాళ విచారణకు హాజరు కాలేకపోతున్నాను అని స్పీకర్ కార్యాలయంకు సమాచారం ఇచ్చాడు. ఫిబ్రవరి రెండో తేదీన విచారణకు హాజరు అవుతానని ఎమ్మెల్యే మద్దాలి గిరి సమాచారం ఇచ్చారు. టీడీపీ- వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో స్పీకర్ తమ్మినేని సీతారం వ్యక్తిగతంగా సమావేశమై చర్చిస్తారు.