Heavy Rains in Tamilnadu: తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు జిల్లాలతో సహా ఎనిమిది జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. డెల్టా జిల్లాలైన తంజావూరు, తిరువారూర్ నాగపట్నంలలో కళాశాలలు కూడా మూసివేయబడ్డాయి. కొద్ది రోజుల క్రితం ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రానున్న నాలుగు రోజుల్లో పదహారు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. చెన్నైలోని నుంగంబాక్కంలో 80.4 మి.మీ కురిసింది, ఇది 72 సంవత్సరాలలో కురిసిన మూడో అత్యధిక వర్షమని చెన్నైలోని ఎంఈటీ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ బాలచంద్రన్ తెలిపారు. గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు తమిళనాడులోని అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. వర్ష బీభత్సానికి ముగ్గురు మరణించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
PM Narendra Modi: మోర్బీ వంతెన కూలిన ప్రదేశాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ
చెన్నైలో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. భారీ వర్షాల కారణంగా 8 జిల్లాల్లో పాఠశాలలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాగా, తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ సీజన్‌లో 35 నుంచి 75 శాతం ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాల సన్నద్ధతను ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సమీక్షించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, మొబైల్ ఫోన్ సేవలను సిద్ధంగా ఉంచడంతోపాటు సహాయక, అత్యవసర ఆపరేషన్ ప్రణాళికలతో జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కోరారు.