టీ20 ప్రపంచకప్ 2024 కోసం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండగా.. వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. రోడ్డు ప్రమాదంతో జట్టుకు దూరమైన రిషబ్ పంత్.. పొట్టి ప్రపంచకప్‌తో భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ 2024లో అదరగొడుతున్న సంజూ శాంసన్‌కు ప్రపంచకప్‌లో ఆడే అవకాశం వచ్చింది. అయితే సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. ఇక స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, ఫినిషర్ రింకూ సింగ్‌లను స్టాండ్‌బై లిస్ట్‌లో చేర్చింది.
గత ఏడాది కాలంగా భారత టీ20 జట్టులో ఉన్న రింకూ సింగ్‌ను పక్కనపెట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రింకూను పక్కనపెట్టడానికి కారణం ఐపీఎల్ 2024 ప్రదర్శనే అని ఇట్టే అర్థమవుతోంది. ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్ తరఫున రింకూ పెద్దగా రాణించలేదు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన రింకూ.. 150 స్ట్రైక్‌రేట్‌తో 123 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 17వ సీజన్‌లో రింకూకు పెద్దగా ఆడే అవకాశం రాలేదనే చెప్ప్పాలి. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్ ఆడుతుండడంతో రింకూ తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం రాలేదు.
Also Read: Flipkart Big Saving Days Sale 2024: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. మే 3 నుంచి ఆరంభం!
మరోవైపు చెన్నై ఆల్‌రౌండర్ శివమ్ దూబే అద్భుత ప్రదర్శన కూడా రింకూ సింగ్ ఎంపికను అడ్డుకుందనే చెప్పాలి. ఐపీఎల్ 2024లో సీఎస్‌కే తరఫున ఫినిషర్‌గా ఆడుతున్న దూబే.. సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ ఆరంభం నుంచే భారీ సిక్సులు బాదుతూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 9 మ్యాచ్‌ల్లో 350 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో 172.41 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో చెన్నై తరఫున అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడు దూబేనే కావడం విశేషం. రింకూ సింగ్ కంటే బౌలింగ్ చేసే సామర్థ్యం కలిగిన దూబే వైపే బీసీసీఐ సెలెక్టర్లు మొగ్గు చూపారు.