Chandrababu Arrest: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా దాఖలు చేసిన మెన్షన్ మెమోపై సీజేఐ నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌ఎల్పీపై బుధవారం విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనపై కేసు నమోదు చేశారని చంద్రబాబు తెలిపారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. ఆయన తరపు లాయర్లు రు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్.. న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి ఎస్వీఎన్ భట్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది. కేసు సంఖ్య నంబర్ 61గా పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానానికి చంద్రబాబు మూడు విన్నపాలు చేశారు. వాటిలో ఒకటి… తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ను కొట్టేయాలని, రెండోది జ్యుడీషియల్ రిమాండ్‌ను సస్పెండ్ చేయాలని, మూడోది.. తనపై విచారణను పూర్తిగా నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. ఇప్పటికే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ ఇవాళ విచారణకు రానుండటంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ ఇవ్వాలంటూ.. చంద్రబాబు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. నేడు మధ్యాహ్నం 2.15 నిమిషాలకు వాదనలు జరగనున్నాయి. రాజధాని నగరానికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దాని అనుసంధానించే రహదారుల అలైన్‌మెంట్‌లో.. అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. చంద్రబాబును మొదటి నిందితుడిగా చేర్చడంతో.. బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వర్చువల్ వాదనలు వినిపించారు. సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదించారు. మరోవైపు, చిత్తూరు జిల్లా అంగళ్లు ఘటనలో బెయిల్ మంజూరు చేయాలంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన సమయంలో.. అంగళ్లు వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ వ్యవహారంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసులో చాలా మందికి బెయిల్ మంజూరైందని.. చంద్రబాబు కూడా బెయిల్ ఇవ్వాలని కోరారు ఆయన తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరును చేర్చింది సీఐడీ. కేసులో లోకేష్ పేరును చేరుస్తూ.. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ని చేర్చింది సీఐడీ. హెరిటేజ్ ప్రైవేట్ సంస్థలో ఈడీగా నారా బ్రాహ్మణి, వైఎస్ ఛైర్మన్ అండ్ ఎండీగా నారా భువనేశ్వరి ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ కుటుంబానికి హెరిటేజ్ లో 50శాతానికి పైగా షేర్లు ఉన్నాయి. మంత్రి హోదాలో లోకేష్ హెరిటేజ్ సంస్థకు ప్రయోజనం చేకూరే విధంగా కుట్ర పన్నారని సీఐడీ పేర్కొంది. రాజధాని రావటానికి ముందే వేరే వ్యక్తులతో తుళ్లూరు, మందడం వంటి ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేశారని తెలిపింది. తర్వాత ఆ వ్యక్తుల నుంచి హెరిటేజ్ సంస్థ..తక్కువ ధరకు స్థలాలు కొనుగోలు చేసిందని.. 2017లో ఇన్నర్ రింగ్ రోడ్డులో స్థలాలు పోకుండా, వాటి విలువ పెరిగేలా లోకేశ్ కుట్ర చేశాడని స్పష్టం చేసింది. చంద్రబాబును ప్రభావితం చేసి.. లోకేష్ తన కుటుంబ సభ్యుల అధీనంలో ఉన్న హెరిటేజ్ సంస్థకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేలా కుట్ర చేసినట్టు పేర్కొంది సీఐడీ.