Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Story Board: దేశంలో ఓటర్ల జాబితాను అప్పుడప్పుడూ సవరించడం తప్పనిసరి. అర్హులకు చోటు కల్పించి అనర్హులపై వేటు వేసేందుకు సర్ నిర్వహించడమూ అవసరమే. దీని పై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండనవసరం లేదు. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ప్రజాప్రాతినిధ్య చట్టం -1951 పూర్తి స్వేచ్ఛను కల్పించింది. ఈసీ ఈ విషయం లో ఎవరి అనుమతి తీసుకోవాల్సిన లేదా ఎవరికీ జవాబుదారీ వహించాల్సిన అవసరం లేదు. దేశంలో ఇలాంటివి జరగడం ఇదే కొత్త కూడా కాదు. 1952 నుంచి 2004 వరకు 13 సార్లు సర్ జరిగింది. కానీ, ప్రస్తుత సర్వే స్థాయిలో అవేవీ వివాదాల్లో చిక్కుకోలేదు. అయితే ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కొడిగట్టిన ప్రస్తుత తరుణంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. సర్ పేరిట జరుగుతున్న తతంగమంతా బీజేపీకి సానుకూలత, విపక్షాలకు ప్రతికూలత కల్పించేందుకేనని, అందుకు కృత్రిమమైనరీతిలో చేర్పులు, ప్రక్షాళనలు జరుగుతున్నాయని ప్రధానమైన ఆరోపణ. పనిలోపనిగా పౌరసత్వ పరీక్షలూ జరుగుతున్నాయనేది మరో ఆరోపణ.
దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికల సంఘం సర్వే చేపట్టింది. అందులోనూ మొదటి విడతగా బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించడంపై ఇప్పటికే తీవ్ర దుమారం చెలరేగింది. మార్పుల తర్వాత జాబితాలో 50 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు గల్లంతు కావడంపై పార్లమెంటు కూడా దద్దరిల్లింది. ఈ వివాదం ఒక కొలిక్కి రాకుండానే దేశమంతటా సర్ కార్యక్రమం చేపట్టనున్నట్టు ఎన్నికల కమిషన్ గత అక్టోబర్ 27న ప్రకటించింది. దీనిపై విపక్ష పాలిత రాష్ర్టాలు తీవ్ర వ్యతిరేకత తెలిపాయి. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమబెంగాల్ ప్రతిఘటించి తీరుతామని శపథం పూనాయి. కానీ తీవ్ర నిరసనల మధ్యే సర్ ప్రక్రియ జరిగింది. ఎన్నికల్లో తమ ఓటమికి సర్ తోనే పునాది పడిందని బెంగాల్లో మమతా బెనర్జీ సుప్రీందాకా వెళ్లి మరీ ప్రతిఘటించారు. దీంతో సుప్రీంకోర్టు సర్ ప్రక్రియ కోసం జ్యుడీషియల్ అధికారులను నియమించింది. చివరకు వారిని కూడా ఘెరావ్ చేసే దుస్థితి రావడం, తమ ఆదేశాల్ని కూడా బెంగాల్ రాష్ట్ర యంత్రాంగం బేఖాతరు చేయడాన్ని సుప్రీం తీవ్రంగా పరిగణించింది. కేంద్ర బలగాల రక్షణలో సర్ జరగాల్సిందేనని, సర్‌కు ఎక్కడైనా ఆటంకాలు ఎదురైతే చూస్తూ ఊరుకునేది లేదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. సర్ నిబంధనల మేరకు జరగకపోతే ఆధారాలతో ఫిర్యాదు చేయొచ్చు కానీ.. అసలు ప్రక్రియనే వద్దనడం పద్ధతి కాదని సర్వోన్నత న్యాయస్థానం పార్టీలకు తలంటింది.
Also Read
- Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
- Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
- Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
- Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
ఉత్తరప్రదేశ్ సర్‌లో ఏకంగా సుమారు 20 శాతం ఓటర్ల పేర్లు, అంటే 2.89 కోట్ల ఓట్లు గల్లంతవడం కలకలం రేపింది. రాష్ట్రంలోని మొత్తం ఓట్ల సంఖ్య 15.44 కోట్ల నుంచి 12.55 కోట్లకు తగ్గిపోయింది. ఇక రాజధాని లక్నోలో 39.9 లక్షల ఓట్లుంటే అందులో 30 శాతం సర్వేలో ఎగిరిపోయి చివరకు 27.9 లక్షలే మిగిలాయి. అందులో కొందరు ఓటర్లు చనిపోయారని, మరికొందరు వేరే ప్రాంతాలకు వలసపోయారని, ఇంకొందరి పేర్లు రెండు లేదా అంతకంటే ఎక్కువచోట్ల ఉన్నాయని కమిషన్ వివరణ ఇచ్చింది. ఏదేమైనప్పటికీ భారీ స్థాయిలో ఓట్ల తొలగింపుపై రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్ కార్యక్రమం వల్ల ఓటర్లలో కొన్ని వర్గాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయని ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది.
సర్‌పై సర్వోన్నత న్యాయస్థానంలో తమిళనాడు న్యాయపోరాటానికి దిగింది. ఎన్నికల సంఘం చేపట్టిన సవరణకు ఎలాంటి రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధత లేదని, పారదర్శకత, సమన్యాయం లోపించాయని ఆరోపించింది. బెంగాల్లో ఏకంగా నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌కు సర్ యంత్రాంగం విచారణ నోటీసు పంపించడంపై వివాదం రేగింది. దేశ విభజన నుంచి బంగ్లా యుద్ధం దాకా అనేక చారిత్రక కారణాల వల్ల బెంగాల్లో పౌరసత్వ సమస్యలున్నాయి. సర్ పేరిట దొడ్డిదారిన సిటిజన్‌షిప్ రిజిష్టర్‌ను ప్రవేశపెడుతున్నారని టీఎంసీ మండిపడింది. ఈ వివాదాల వెనుక నిజానిజాల మాట అటుంచితే, ప్రజలకూ, పార్టీలకూ సర్‌పై అంతులేనన్ని అనుమానాలున్నాయన్న మాట నిజం. పార్టీలు ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల సంఘంపై కూడా నమ్మకం ఉంచటం లేదు. అయితే బెంగాల్ సర్ విషయంలో అభ్యంతరాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని అడిగితే.. ఏ పార్టీ నుంచీ స్పందన రాలేదు. కనీసం తుది జాబితాపై అభ్యంతరాలు అడిగినా.. ఎవరూ ముందుకు రాలేదు. తగినంత సమయం ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో.. సర్‌ను రాజకీయ వివాదంగా మార్చొద్దని సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది.
ప్రస్తుతం తెలంగాణలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ.. సర్ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ను పీసీసీ కోరింది. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నందున ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా 2-3 నెలల్లో హడావిడిగా ముగించకుండా, ఏడాదిన్నరపాటు జాగ్రత్తగా చేయాలని సూచించింది. సర్‌లో ఓటు తొలగిస్తే దరఖాస్తు చేసుకోవడానికి గడువును 3 నెలలకు పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే జనగణన ప్రక్రియ జరుగుతున్నందున దాంతోపాటే సర్ నిర్వహిస్తే.. సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుందనే ఆందోళ కూడా ఉంది. బూత్ లెవెల్ అధికారులు ప్రత్యక్షంగా 3-4 సార్లు ప్రతి ఇంటికి వెళ్లి ఓటు తనిఖీ చేయాలి. విదేశీయులు ఉన్నారనే నెపంతో ఓట్లు తొలగించే ప్రక్రియ సరికాదనే సూచనలు వస్తున్నాయి.
మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ముస్లిం ఓటర్లు, ఏపీ ఓటర్ల పేర్ల తొలగింపుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటిదాకా సర్ జరిగిన రాష్ట్రాల్లో ఎదురైన అనుభవాల్ని బట్టి.. పాతబస్తీలో ముస్లిం ఓట్లను గంపగుత్తగా తొలగించి.. పౌరసత్వ నిరూపణ అడుగుతారేమోననే భయాలు లేకపోలేదు. అలాగే ఏపీ ఓటర్ల పేర్లు పెద్ద సంఖ్యలో తొలగిస్తే.. జీహెచ్ఎంసీలో చాలా నియోజకవర్గాల్లో ఫలితాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయనే భయం అన్ని పార్టీల్లోనూ ఉంది. ఉదాహరణకు బెంగాల్లో సర్ కారణంగా టీఎంసీతో పాటు అనూహ్యంగా బీజేపీకీ నష్టం తప్పలేదు. ఇక్కడ కూడా సర్ పూర్తయ్యాక.. ఏ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో తేలుతుందని పార్టీలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి అన్ని పార్టీలూ.. సర్ విషయంలో ముందస్తు సన్నద్ధతను పూర్తిచేసినా.. చివరకు ఏమౌతుందోననే టెన్షన్ మాత్రం అందరికీ తప్పటం లేదు. సర్ ప్రక్రియలో ఏ ప్రాంతంలో ఎలాంటి నిబంధనలు తెరపైకి వస్తాయి..? ఓటర్ల విషయంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? పార్టీల అభ్యంతరాలకు ఏ మేరకు విలువ ఇస్తారు..? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే. కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి అనుకూలంగా సర్ జరుగుతుందేమోనని ప్రతిపక్షాలు గట్టిగా అనుమానిస్తున్నాయి. తుది జాబితాలు వెల్లడయ్యాకే.. అసలు విషయ తెలుస్తుందని, అందాకా ఓపిక పట్టాలని కాషాయ పార్టీ కౌంటరిస్తోంది. మరోవైపు తమను ఏం డాక్యుమెంట్లు అడుగుతారోనని కొందరు ఓటర్లు కూడా కంగారు పడుతున్నారు.
ఓటర్ల జాబితాలో పారదర్శకత కోసం సర్ అవసరమే అనే వాదనతో అన్ని పార్టీలూ ఏకీభవిస్తున్నాయి. కానీ సర్ ప్రక్రియకు ఎంచుకుంటున్న సమయం, సందర్భంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇక్కడ అవకతవకలు ఉన్నాయా.. లేదా అనేది పక్కనపెడితే.. అసలు అనుమానాలు కలిగేలా ఎందుకు వ్యవహరించాలనే ప్రశ్నకు మాత్రం కచ్చితంగా జవాబు వెతకాల్సిందే. అటు పార్టీలు,ఇటు ఓటర్లు అందరిలోనూ నమ్మకం కలిగించే విధంగా ఈసీ విధానాలకు పదునుపెట్టాలనే సలహాలు వస్తున్నాయి. అనవసర ఆందోళనలు, వివాదాలకు తావివ్వకుండా.. ఎవ్వరూ వేలెత్తిచూపటానికి వీల్లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో సర్ జరగాలనే భావన వ్యక్తమవుతోంది. అయితే మన దగ్గర బీహార్, బెంగాల్ మాదిరి రగడకు ఆస్కారం లేదని, ఇక్కడ చాలావరకు ఓటర్లకు సరైన పత్రాలుంటాయనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.
దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో నవంబర్ 4, 2025 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. సర్ ప్రక్రియను చేపట్టింది భారత ఎన్నికల సంఘం. ఈ ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగి, ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. అండమాన్ నికోబార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో సర్ ఇప్పటికే పూర్తైంది. చివరిసారి ఈ ప్రాంతాల్లో సర్ ప్రక్రియ 2002 – 2005 మధ్య కాలంలో జరిగింది. సాధారణంగా ఓటర్ల జాబితాకు సంబంధించి భారత ఎన్నికల సంఘం రెండు రకాల పనులను చేపడుతుంది. ఒకటి స్పెషల్ సమ్మరీ రివిజన్ ..ఎస్ఎస్ఆర్. దీన్ని ఎన్నికల సంఘం ప్రతి ఏటా నిర్వహిస్తుంది. ఈ ఎస్ఎస్ఆర్ ప్రక్రియలో కొత్త ఓటర్లను చేర్చడం, చనిపోయిన వారిని ఓటరు జాబితా నుంచి తీసివేయడం, ఓటర్ల వ్యక్తిగత వివరాల్లో అవసరమైన సవరణలు చేపట్టడం వంటివి చేస్తారు. రెండోది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ . దీన్నే సర్ అంటారు. ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను నిర్వహిస్తుంది. ఎస్ఎస్ఆర్ మాదిరిగా కాకుండా.. సర్‌ను చేపట్టినప్పుడు ఓటర్ల జాబితాలోని వారంతా తమ ఎన్యుమరేషన్ ఫామ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం మీద సర్ ప్రక్రియ ఐదు దశల్లో జరుగుతుంది.
తొలి దశలో ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్ అధికారులు ప్రతి ఇంటికీ వచ్చి ఎన్యుమరేషన్ ఫామ్‌లను ఇస్తారు. ఓటరు జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కొత్త ఫామ్‌ను నింపి, వారికి సమర్పించాలి. అధికారులు ప్రతి ఇంటికీ కనీసం మూడుసార్లు వస్తారని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఫామ్‌ను నింపి, సమర్పించిన తర్వాత రశీదు కాపీని కూడా అందజేస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది. అదే చిరునామాలో ఓటర్లు నివసిస్తున్నారా? లేదంటే చనిపోయారా? లేదంటే మరో ప్రాంతానికి వారు శాశ్వతంగా తరలివెళ్లారా? అనేది అధికారులు పరిశీలిస్తారు. రెండో దశలో ఓటర్ల నుంచి నింపిన ఎన్యూమరేషన్ ఫామ్‌లను స్వీకరిస్తారు. మునపటి ఓటర్ల జాబితాతో వారి వివరాలు సరిపోలుతున్నాయో లేదో బూత్ లెవల్ అధికారులు పరిశీలిస్తారు. ఏదైనా తేడాలుంటే, ఆ ఓటరు నుంచి వివరణ కోరతారు. ఆ తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ఈ సమయంలో కొత్త ఓటర్ల రిజిస్ట్రేషన్‌ను చేపట్టరు. ఓటర్ల జాబితాలో అప్పటికే ఉన్న ఓటర్లకు మాత్రమే ఈ దశ. ఇక మూడో దశలో డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ప్రచురించిన తర్వాతనే కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన ఫామ్‌లను స్వీకరిస్తారు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోయినా, పాత ఓటర్లు వేరే ప్రాంతంలో కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకున్నా, కొత్తగా ఎవరినైనా చేర్చడంపై అభ్యంతరం ఉన్నా ఈ దశలో అప్లికేషన్ ద్వారా అప్పీల్ చేయొచ్చు. కీలకమైన ఈ అప్పీల్ దశకే కాస్త ఎక్కువ సమయం కేటాయించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఆ తర్వాత నాలుగో దశలో ఓటర్ల నుంచి వచ్చిన అప్పీళ్లను, అభ్యంతరాలను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పరిశీలిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఒక డిప్యూటీ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను పరిశీలించి, అవసరమైన సవరణలను వీరు చేపడతారు. నాలుగు దశలూ పూర్తయ్యాక.. ఐదో దశలో తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు. ఇంత సుదీర్ఘంగా జరిగే సర్ ప్రక్రియలో అవకతవకలకు తావు లేదని, ఎక్కడైనా పొరపాట్లు జరిగినా.. చివరి విడతకు వచ్చేసరికి అసలైన సమాచారమే మిగులుతుందని ఈసీ చెబుతోంది.
ఒకవేళ ఓటరు తమ పాత అడ్రస్లోనే నివసిస్తుంటే, ఎన్యుమరేషన్ ఫామ్‌ను నింపి, పోలింగ్ స్టేషన్ అధికారికి సమర్పించాలి. ఈ సమయంలో ఎలాంటి డాక్యుమెంట్లనూ ఇవ్వాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం తెలిపింది. నిర్దేశిత గడువులోగా ఈ ఫామ్‌ను సమర్పించలేని వారు, అభ్యంతరాల పిటిషన్లను సమర్పించే దశలో సమర్పించవచ్చని ఎన్నికల సంఘం చెప్పింది. ఓటర్లు తప్పనిసరిగా వ్యక్తిగతంగా ఈ ఫామ్‌ను సమర్పించాల్సి ఉన్నప్పటికీ, ఎవరైనా చదువుల కోసం లేదా ఏదైనా పని నిమిత్తం వేరే ప్రాంతంలో ఉండి రాలేకపోతే, కుటుంబ సభ్యులు హామీగా ఉంటూ, వారి తరఫున ఆ ఫామ్‌ను నింపి, సమర్పించాలి. ఒకవేళ అదే పట్టణంలో లేదా నగరంలో అంతకుముందటి అడ్రస్‌లో కాకుండా వేరే ప్రాంతంలో నివసిస్తుంటే, ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వారు ఎన్యుమరేషన్ ఫామ్‌ను పూరించి ప్రస్తుతం నివసిస్తోన్న ప్రాంతంలోని పోలింగ్ స్టేషన్ అధికారికి సమర్పించాలి.
సర్ ప్రక్రియ సమయంలో ఓటర్లు శాశ్వతంగా లేదా తాత్కాలికంగా వేరే ప్రాంతానికి వెళ్లారా? అనేది పోలింగ్ స్టేషన్ అధికారులు రికార్డు చేస్తారు. చాలా కుటుంబాలు ఇతర పట్టణాల్లో శాశ్వతంగా నివసిస్తున్నప్పటికీ, ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు తమ స్వస్థలానికి వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో, ఎన్యుమరేషన్ ఫామ్‌ను ఎన్నికల సంఘం వద్ద నమోదై ఉన్న పాత అడ్రస్‌లో సమర్పించలేకపోతే.. వారి పేర్లను అక్కడ తొలగిస్తారు. ప్రస్తుతం వారు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ పోలింగ్ స్టేషన్ వద్ద తమ పేర్లను నమోదు చేసుకునేందుకు కొత్తగా అప్లికేషన్‌ను పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎన్యుమరేషన్ ఫామ్‌తో ఈ ప్రక్రియ చేపట్టిన తర్వాత ఓటరు జాబితాలో ఏమైనా తేడాలుంటే, ఎన్నికల సంఘం వాటికి వివరణ కోరుతుంది. ఆ సమయంలో నోటీసు అందుకున్న వారు మాత్రమే తమ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం చెబుతోంది.
ఏతావాతా సర్ ప్రక్రియలో ఈసీ చెబుతున్న విధానమంతా పేపర్ మీద సజావుగానే కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అమలు దగ్గరే తేడా వస్తోందని రాజకీయ పార్టీలు అభ్యంతరం చెబుతున్నాయి. సర్ ప్రక్రియలో ఓట్ చోరీ ఎలా జరుగుతోందో రాహుల్ గాంధీ ఉదాహరణలతో సహా బహిరంగంగా వివరించడంతో.. ఈసీ ఉలిక్కిపడింది. ఆ తర్వాత సర్దుకుని.. రాహుల్ తాను చూపే ఆధారాలకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరింది. అయితే దీనికి రాహుల్ అంగీకరించకపోవడంతో.. ఆయన ఆరోపణల్లో పస లేదని ఈసీ కొట్టిపారేసింది. తాను ఆధారాలతో సహా చెబుతున్నా.. ఇంకా లిఖితపూర్వక ధృవీకరణ అడగటంలో అర్థం లేదని రాహుల్ తీవ్రంగా మండిపడ్డాయి. చివరకు ఈసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్షాలు.. సీఈసీ అభిశంసనకు కూడా సిద్ధపడ్డాయి. అయితే పార్లమెంట్లో తగిన బలం లేక.. ఈ ప్రతిపాదన ముందుకు వెళ్లలేదు. అన్నింటికీ మించి ఓట్ చోరీ జరిగిందని ప్రతిపక్షాలు విస్తృతంగా ప్రచారం చేసిన రాష్ట్రాల్లోనూ వాటికి ప్రజామద్దతు దొరకలేదని.. బీజేపీ బీహార్, బెంగాల్ ఫలితాల్ని నిదర్శనంగా చూపింది. సర్ విషంయలో అనుమానాలు, అపోహలన్నీ ప్రతిపక్షాలకే పరిమితం కానీ.. ప్రజలకు ఎలాంటి అభ్యంతరాల్లేవని ఫలితాలతోనే తేలిపోయిందని బీజేపీ అంటోంది. కానీ ఫలితాలు అనుకూలంగా వచ్చినంతమాత్రాన అభ్యంతరాలను లైట్ తీస్కోకూడదని, పారదర్శకత విషయంలో రాజీ లేదని చాటిచెప్పాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సర్ విషయంలో విమర్శలు, ప్రతి విమర్శలకు తెరపడటం లేదు. ఓసారి ప్రతిపక్షాల వాదన నిజమేనని, మరోసారి ఈసీ వివరణ సరిగానే ఉందని అనిపిస్తుండటంతో.. ఓటర్లు మరింతగా అయోమయానికి గురవుతున్నారు. బిహార్‌లో సర్ చేపట్టినప్పుడు ఓటు చోరీ జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ సమయంలో లక్షల మంది అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించారని అంటోంది. సర్ అంటేనే ఓటు చోరీ అంటూ విపక్షాలు చేసే ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టేస్తోంది. సర్ అవసరాన్ని ఎన్నికల సంఘం నొక్కి చెబుతోంది. వేగవంతమైన పట్టణీకరణ, పెద్ద ఎత్తున వలసలు, యువ పౌరులు ఓటేసేందుకు అర్హులుగా మారడం, ఎన్నికల జాబితాలో అక్రమంగా విదేశీయులను చేర్చడం వంటి వాటి దృష్ట్యా ఓటర్ల జాబితాను పూర్తిగా సవరించాల్సిన అవసరం ఉందని ఎన్నికల సంఘం వాదిస్తోంది.
బిహార్‌లో అనుభవాలను బట్టి సర్ ప్రక్రియలో ఎన్నికల సంఘం ఎన్నో మార్పులు చేసిందని మాజీ సీఈసీలు కూడా చెబుతున్నారు. ఎన్యుమరేషన్ ఫామ్ ను సమర్పించేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్‌నూ అందించాల్సిన అవసరం లేకపోవడం దీనిలో భాగమేనని చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. చివరిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో సర్ ప్రక్రియను చేపట్టారు. ఆ తర్వాత ఇప్పటిదాకా సర్ ప్రక్రియ జరగలేదు. అయితే, ప్రస్తుతం ఎన్నికల సంఘం చేపడుతోన్న సర్ ప్రక్రియకు మూడు నెలలు సరిపోవని నిపుణులు అంటున్నారు. తమ పత్రాలు సమర్పించుకునేందుకు ప్రజలకు తగినంత సమయం ఇవ్వాలని చెబుతున్నారు. ఎన్నికల సంఘానికి సర్‌ను నిర్వహించే అధికారం ఉంటుంది. కానీ, దాన్ని సరిగ్గా చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వం నుంచి పూర్తి సాయం, మద్దతు అవసరం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సహకరించకపోతే, ఈ ప్రక్రియ క్లిష్టమవుతుంది. అలా కాకుండా రాష్ట్రాల నుంచి సహకారం అందాలంటే.. అనవసర అపోహలు, అపార్ధాలకు తావివ్వకూడదు. రాజకీయ పార్టీల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆరోపణలన్నింటినీ ఒకే గాటన కట్టకుండా నిజానిజాలపై పరిశీలన చేయడం.. ప్రక్రియలో మరింద పారదర్శకతను పెంచుతుందనే విశ్లేషణలు వస్తున్నాయి.
మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రతి ఎన్నిక కేవలం రాజకీయ పార్టీల మధ్య పోటీకి ఒక వేదిక మాత్రమే కాదు, పౌరుల ప్రజాస్వామ్య విశ్వాసానికి నిదర్శనం కూడా. ఎన్నికల ప్రక్రియలో ఉండే నిష్పాక్షికత, పారదర్శకతే ఈ విశ్వాసానికి పునాది. ఏ పౌరుడు తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుంటాడో నిర్ధారించేది ఓటరు జాబితానే కాబట్టి, ఈ ప్రక్రియకు ఓటరు జాబితానే ఆధారం. ఈ తరుణంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. SIR వివాదాలకి కేంద్రంగా మారటం ఎవరికీ మంచిది కాదు. ఓటర్ల జాబితా కచ్చితంగా, తాజాగా ఉండేలా చూసుకోవడానికి ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను క్రమం తప్పకుండా సవరిస్తుంది. కానీ ఆ ప్రక్రియలో ఎక్కడా అభ్యంతరాలు రాకుండా, పొరపాట్లు జరగకుండా చూసుకోవడం అత్యవసరం అనడంలో మరో మాటకు తావే లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం, ఓటర్ల జాబితాల సమగ్రతను నిర్ధారించే అధికారం, ఆ బాధ్యత ఎన్నికల సంఘానికి అప్పగించారు. ఇక్కడ సర్ లక్ష్యాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, దాని అమలుపై పలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మన దేశానికి ప్రజాస్వామ్యమే దాని అతిపెద్ద బలం, ఎన్నికల సంఘం దానికి కాపలాదారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వంటి కార్యక్రమాలను పారదర్శకతతో, విస్తృత భాగస్వామ్యంతో అమలు చేస్తే, అవి ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయగలవు. కానీ వాటిపై సందేహాలు మిగిలి ఉంటే, అది సంస్థాగత విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది.
ఇక్కడ పార్టీలు రాజకీయం చేస్తున్నాయా.. లేదా అనే విషయం గురించి పట్టించుకోకుండా.. ఈసీ తన వంతుగా రాజ్యాంగ నైతిక విలువలు, సాంకేతిక పారదర్శకత, పౌర భాగస్వామ్యం ఆధారంగా తన ప్రక్రియలను పునర్నిర్వచించుకోవడం.. ఆ సంస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. అదే సమయంలో, రాజకీయ పార్టీలు కూడా సంస్థల స్వాతంత్ర్యాన్ని గౌరవింేచాలి. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు వంటివి. ఓటర్ల జాబితా కచ్చితత్వం, ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తిని ప్రశ్నించినట్లయితే, ప్రజాస్వామ్య ఆత్మ ప్రమాదంలో పడవచ్చు. క్రికెట్ ఆడేటప్పుడు ఆగటగాళ్లు ప్రత్యర్థుల ఆటతీరును తప్పుబడితే పర్లేదు కానీ.. మొత్తం ఆటను పర్యవేక్షించే అంపైర్లను తప్పుబడితే మాత్రం కచ్చితంగా వివాదాలు వస్తాయి. ఇప్పుడు ఎన్నికల వ్యవస్థలో ఈసీది కూడా అంపైర్ పాత్రేననే వాదన బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో క్రికెట్లో రాంగ్ అంపైరింగ్ ఉన్నట్టే.. ప్రస్తుతం ఈసీ కూడా తన బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే సర్ ప్రక్రియలో ఎన్ని వివాదాలున్నా.. ప్రతిపక్షాలు, ఈసీ మధ్య ఘర్షణ వైఖరి నెలకొన్నా.. సుప్రీం జోక్యం చేసుకున్నచోట.. ప్రక్రియ సజావుగానే పూర్తైంది. అలాంటి ఉదాహరణల్ని దృష్టిలో పెట్టుకుని.. మిగతా చోట్ల కూడా సుప్రీం సూచనలకు అనుగుణంగా నడుచుకుంటే.. అనవసర వివాదాలకు తెరపడుతుందనడంలో సందేహం లేదు.
భారత్‌లో దాదాపు 2కోట్ల మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఉన్నట్లు కేంద్రం గతంలో చెప్పింది. వీరంతా అక్రమ మార్గాల్లో దేశంలోకి ప్రవేశించారని, వీరికి సంబంధించి కచ్చితమైన డేటా సేకరించడం సాధ్యం కాదన్నారు. ఇలా అక్రమంగా ప్రవేశించి ఓటు హక్కు నుంచి పొందిన వారిని ఈ జాబితా నుంచి తొలగించాలనే వాదన ఉంది. ఇందుకోసం ఫాం-6తోపాటు కాకుండా ఎన్నికల ప్రక్రియనూ పునపరిశీలించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ ఒక్క బంగ్లాదేశ్ నుంచే కాదు.. మన సరిహద్దు దేశాల్లో ఎక్కడ నుంచైనా అక్రమంగా అక్కడి పౌరులు వచ్చి మన దేశంలో అక్రమంగా ఓటరు జాబితాలో పేర్లు చేర్చుకోవడం దేశభద్రతకే ప్రమాదమే వాదన వినిపిస్తోంది. ఈ వాదన నిజమే అయినా.. అందుకోసం ఓటర్లందర్నీ భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సబబనేది విపక్షాలు వేస్తున్న సూటి ప్రశ్న.
ఇప్పటిదాకా ఎన్నికలు ముంచుకొచ్చిన రాష్ట్రాల్లో సర్ జరిపి విమర్శల పాలైన ఈసీ.. ఇప్పుడు ఎన్నికలకు రెండు, మూడేళ్లు సమయం ఉన్న తెలుగు రాష్ట్రాల్లో సర్‌కు తెరలేపి.. ఇప్పట్నుంచే హడావుడి చేస్తోందనే ఆరోపణలు ఎదుర్కుంటోంది. తెలంగాణ విషయానికొస్తే.. హైదరాబాద్‌లో ముస్లింఓట్లను టార్గెట్ చేస్తారనే చర్చ గట్టిగా జరుగుతోంది. అలాగే ఎప్పట్నుంచో హైదరాబాద్ లో రోహింగ్యాలున్నారని కేంద్రం వాదిస్తూ వస్తోంది. కాబట్టి రోహింగ్యాల పేరుతో.. ఎన్ని ఓట్లు ఏరేస్తారోననే భయాలున్నాయి. అదే సమయంలో హైదరాబాద్ లో ఉన్న ఏపీ ఓటర్లకు రెండు రాష్ట్రల్లోనూ ఓట్లున్నాయి. కొందరికి ఇక్కడ ఆధార్, అక్కడ ఓటర్ కార్డు కూడా ఉన్నాయి. చాలామందికి రెండు చోట్లా ఓట్లున్నాయని, వీరిలో మెజార్టీ ఓటర్లు పొద్దున తెలంగాణలో ఓటేసి.. సాయంత్రంలో ఏపీ వెళ్లి ఓటేస్తున్నారని గతంలో కొన్ని పార్టీలు కూడా ఆరోపించాయి. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలనే సూత్రం ప్రకారం.. వీరి ఓట్లు పోతాయనే ప్రచారం బాగా జరుగుతోంది. 2018, 2023 ఎన్నికల్లో ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావడంతో.. ఏపీ ఓటర్లు ఇక్కడ ఓటేసి.. తర్వాత జరిగిన ఏపీ ఎన్నికల్లోనూ లక్షల్లో తరలివెళ్లి ఓటేశారనే చర్చ జరిగింది. ఇకపై అలాంటివి జరగకుండా సర్ ప్రక్రియతో అడ్డుకట్ట పడుతోందనే వాదన వినిపిస్తోంది.
మొత్తం మీద సర్ విషయంలో సానుకూలతల కంటే.. అభ్యంతరాలకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోంది. హడావుడిగా అమలు జరుపుతున్న తీరు.. ఇప్పటికే సర్ నిర్వహించిన రాష్ట్రాల్లో వచ్చిన సమస్యలు, కొన్నిచోట్ల ముందు తరాలకు సంబంధించిన ఆధారాలు అడగటం వంటివి.. రాజ్యాంగబద్ధ ప్రక్రియను కాస్తా.. తీవ్ర వివాదాస్పదం చేశాయనడంలో సందేహం లేదు. ఈ విషయంలో పార్టీల రాజకీయాల సంగతి పక్కనపెడితే.. ఈసీ మరింత పారదర్శకంగా వ్యవహరించడం తప్పనిసరి అని మాజీ సీఈసీలు కూడా అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
-
Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2026 Playoffs Scenario: కేకేఆర్ సెన్సేషనల్ విక్టరీ.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..