Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌ను మహా సంక్షోభం వెంటాడుతోంది. ఆర్థిక మాంద్యం నుంచి తప్పంచుకోవాలంటే ఏకైక మార్గం పొదుపు మంత్రం. ప్రధాని మోడీ సూత్రాలను పాటిస్తే…దేశం ఆర్థిక కష్టాల నుంచి బయట పడుతుంది. అమెరికా దాడులతో ఇరాన్లో పెట్రోల్ ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఆ ఎఫెక్ట్ చమురు సరఫరాపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. అది ఆర్థిక సంక్షోభంగా మారుతోంది. చమురు సరఫరా ఆగిపోతే…అనేక రంగాలపై ఎఫెక్ట్ పడుతుంది. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. మహా సంక్షోభం ముంచుకొస్తోంది. వేసే ప్రతి అడుగు…తీసుకునే ప్రతి నిర్ణయం…జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ మాత్రం తేడా వచ్చినా…జనం రోడ్డున పడాల్సి వస్తుంది. మహా మాంద్యంపై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన కేంద్రం…ఆలస్యంగా మేల్కొంది. దీంతో ఇప్పుడు పొదుపు మంత్రం జపించాలంటూ…ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేస్తోంది.
అదుపు…అదుపు..మాట పొదుపు అన్నది సామెత. దీన్ని భారతీయులు…నెల బడ్జెట్‌కు అన్వయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేశానికి మహా సంక్షోభం ముంచుకొస్తున్న వేళ…ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించకపోతే ఏరికోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. భవిష్యత్‌లో వచ్చే కష్టాలపై ఇప్పట్నుంచి జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు పాలుకాకతప్పదు. తర్వాత ప్రభుత్వాన్ని తిట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైనపుడు కేంద్ర ప్రభుత్వం మేల్కోనలేదు. ఆ తర్వాత అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ వార్ మొదలైనపుడు…భారత్‌కు వచ్చే ముప్పును పసిగట్టలేకపోయింది. అలర్ట్‌గా వ్యవహహరించాల్సిన కేంద్రం…ఏమవుతుందిలే అన్నట్లు చూస్తూ కాలం గడిపింది. ఇరాన్ యుద్ధం ముదిరే కొద్దీ…భారత్‌కు ఊహించని కష్టాలు చుట్టుముట్టాయి. 39 రోజుల పాటు సాగిన తర్వాత అమెరికా యుద్ధానికి విరామం ప్రకటించింది. అయితే అప్పటికే ప్రపంచ దేశాలకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
Also Read
- Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
- Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
పశ్చిమాసియా సంక్షోభంతో పౌరులు ఇంధన వినియోగం తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడం…దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్-రష్యా, అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలైనపుడు అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే…భారత్ మహా సంక్షోభంలో కూరుకుపోయి ఉండేది కాదు. ఆ రెండు యుద్దాలతో వచ్చే ప్రమాదాన్ని…విపత్కర పరిస్థితులను అంచనా వేయడంలో కేంద్రం విఫలమైంది. తనకు తానుగా ఆర్థిక చర్యలకు ఉపక్రమించాల్సి ఉండాల్సింది. కానీ అదేం చేయలేదు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వేళ…పుతిన్ భారత్‌కు అనేక ఆఫర్లు ఇచ్చారు. వాటిని సద్వినియోగం చేసుకొని…10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి ఉంటే…ప్రస్తుతం పరిస్థితులు మరోలా ఉండేవి. ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందుల నుంచి ఆ పెట్టుబడులు బయట పడేసేవి. అతి తక్కువ ధరకు పెట్రోల్ ఆఫర్ చేసినా కొంతకాలమే తీసుకున్నాం. కానీ దాన్ని సుదీర్ఘకాలం పొటు కొనసాగించలేకపోయింది కేంద్రం. కాళ్ల దగ్గరకు వచ్చిన మంచి ఆఫర్లను…అమెరికా ఒత్తిడికి తలొగ్గి వెనుకంజ వేసింది. ఇప్పుడు పెట్రోల్, గ్యాస్ కోసం అష్టకష్టాల పడాల్సి వస్తోంది.
గత కొన్నేళ్లుగా ప్రపంచం నిరంతరం అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటోంది. మొదట కోవిడ్ సంక్షోభం, ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక సవాళ్లు, ఇప్పుడు పశ్చిమాసియా ఉద్రిక్తతలు. ఈ పరిస్థితులన్నింటి ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడుతోంది. ఇందులో మన దేశం కూడా ప్రభావింత అవుతోంది. అయితే మనం కోవిడ్-19 మహమ్మారిని ఎలాగైతే అధిగమించామో, దీని నుంచి కూడా అలాగే బయటపడాలి. మన దేశం, యుద్ధాన్ని లేదా మరేదైనా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పౌరులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. ఈ రోజు మనం కూడా అదే చేయాలి. ముడి చమురు, ఎల్పీజీ కోసం భారత్ పశ్చిమాసియాపై ఎక్కువగా ఆధారపడి ఉంది. కాబట్టి ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితి దృష్ట్యా బంగారం కొనుగోలును వాయిదా వేయాలి. ఎందుకంటే ఈ విలువైన లోహాన్ని దిగుమతి చేసుకోవడానికి గణనీయమైన మొత్తంలో విదేశీ మారకం ఖర్చవుతుంది.
పశ్చిమాసియా యుద్దం వల్ల మనదేశ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే చాలా సంక్లిష్టంగా మారింది. దేశ ప్రజలకు ఇటువంటి పిలుపును భారత ప్రభుత్వం చాలా ముందే ఇచ్చి ఉండాల్సింది. గత నెలలో భారతదేశం ముడి చమురు కొనుగోళ్లు తగ్గాయి. అంటే గత నెల నుంచి ఇప్పటివరకు మన దేశం పాత చమురు నిల్వలపైనే ఆధారపడుతూ వస్తోంది. ఈ లెక్కన రాబోయే నెలల్లో భారత్ వద్దనున్న ఇంధన నిల్వలపై ఒత్తిడి పెరగొచ్చు. ఆ ప్రతికూల పరిస్థితుల్లో భారతదేశం అధిక ధరలకు ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వస్తే, దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కచ్చితంగా పడుతుంది. ఖరీదైన ముడి చమురును దిగుమతి చేసుకుంటే, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతాయి. దేశంలో ఇంధన ధరలను పెంచితే, వెంటనే పలు రంగాలలో వ్యయాలు పెరిగిపోతాయి. అందుకే డీజిల్ ధరలను పెంచడం అంత మంచిది కాదు. ఎందుకంటే వ్యవసాయం, సరుకుల రవాణాలో డీజిల్‌ను విరివిగా ఉపయోగిస్తుంటారు. డీజిల్ ధరలను ఏ మాత్రం పెంచినా, ఆ ప్రభావం చివరకు నిత్యావసర వస్తువుల ధరలపై కనిపిస్తుంది. సామాన్య పౌరులపై అదనపు భారం పడుతుంది.
త్వరలోనే భారత్‌లో మరోసారి పెట్రోలు, డీజిల్ ధరల పెంపు జరిగే అవకాశాలు ఉన్నాయని జీటీఆర్ఐ తాజా అధ్యయన నివేదిక హెచ్చరించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల రేంజులోనే కదలాడుతుండటం అనేది ఆందోళన కలిగించే అంశం. మే 9న బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్‌లో 1 బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్ల నుంచి 101 డాలర్ల మేర పలికిందని జీటీఆర్ఐ గుర్తు చేసింది. ఏప్రిల్ 30న అమెరికా – ఇరాన్ సైనిక ఘర్షణ తీవ్రరూపు దాల్చడంతో 1 బ్యారెల్ ముడి చమురు ధర ఏకంగా 126 డాలర్లు దాటింది. 2020 ఏప్రిల్‌లో కొవిడ్-19 లాక్డౌన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు బ్యారెల్‌కు 20 డాలర్ల దిగువకు పడిపోయాయి. చమురు చరిత్రలోనే అది అత్యంత అసాధారణమైన కాలమనేది మరచిపోవద్దు.
భారత్‌లోని పెట్రోలు, డీజిల్ ధరలపై పశ్చిమాసియా సైనిక సంక్షోభం ఒత్తిడి ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. బలహీనపడుతున్న రూపాయి వల్ల మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు, సరుకులు రాబోయే నెలల్లో మరింత ఖరీదైనవిగా మారొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన వనరులను, దిగుమతి చేసుకునే ఉత్పత్తులను భారతీయులు మరింత వివేకంతో ఉపయోగించుకోవాలి. దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…బాధ్యతతో హెచ్చరించారు. పెరుగుతున్న చమురు ధరలు, పశ్చిమాసియా సంక్షోభంతో మన దేశ విదేశీ మారక నిల్వలను మరింత బలహీనపరిచాయి. కరెంట్ అకౌంట్ లోటు మరింత పెరిగితే, రూపాయి మరింత బలహీనపడుతుంది. ఈ పరిస్థితుల్లో దేశ ప్రజలకు ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు చాలా ముఖ్యమైంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులు, వస్తువులు, చమురు వినియోగాన్ని తగ్గిస్తే మన విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది. రూపాయి బలహీనపడటాన్ని అరికట్టొచ్చు. విదేశాల నుంచి నిత్యావసర దిగుమతులను మనం ఆపలేకపోవచ్చు. అయితే వినియోగాన్ని తగ్గించగలిగిన చోటల్లా ప్రజలు అందుకు ప్రయత్నించాలి. దేశం సంక్షోభం ముంగిట్లో ఉంది. ఏ క్షణమైనా అది ప్రమాద ఘంటికలు మోగించే అవకాశం ఉంది. మహా మాంద్యం నుంచి బయటపడాలంటే…పొదుపు మంత్రానికి అలవాటు పడాలి. ఆర్థిక సూత్రాలను పక్కాగా అమలు చేసి…నెల వారి బడ్జెట్‌ను కంట్రోలు చేసుకోవాలి. పొదుపు పాఠాలు పక్క వారికి చెప్పడమే కాదు..దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది.
పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ఇంకా బ్రేక్ పడలేదు. శాంతి ప్రయత్నాలు జరుగుతున్నా ఏవీ కొలిక్కి రావడం లేదు. ఆ యుద్ధం తాలూకు ప్రభావం కొనసాగుతూనే ఉంది. దాదాపు 2 నెలలుగా అంతర్జాతీయంగా చమురు గురించే ప్రస్తావన. వాహనాలకే కాదు. ఆర్థిక వ్యవస్థలకూ ఇంధనం. ఇదే మరి. అందుకే అంత కలవరం. దాదాపు ప్రతీ రంగం చమురుపై ఆధారపడడం ఇందుకు ప్రధాన కారణం. వాటన్నింటిపైనా ఇప్పుడు ఎఫెక్ట్ తప్పడం లేదు. ఈ జాబితాలో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ముందు వరుసలో ఉన్నాయి. అంటే నిత్యావసర సరుకుల ధరల పోటు తప్పదన్నమాట. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఇప్పటికే ఎఫ్ఎమ్సీజీ సంస్థలు ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్నాయి. అందుకే ఈ మధ్యే ధరలు పెంచాయి. ఇప్పుడిది కూడా చాలక మళ్లీ పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పశ్చిమాసియా యుద్ధం త్వరలోనే మన ఇంటి బడ్జెట్ లెక్కల్ని మార్చనుంది.
మీ ఇంటి బడ్జెట్ ఎంతైతే…అంత ఆ మొత్తానికి కనీసం 500 నుంచి వెయ్యి రూపాయలు ఇకపై అదనంగా పక్కన పెట్టుకోవాల్సిందే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో నిత్యావసర సరుకుల ధరలపై త్వరలోనే ఈ ప్రభావం గట్టిగానే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే నెలవారీ బడ్జెట్లో మార్పులు తప్పేలా లేవు. సాధారణంగా యుద్ధం మొదలైనప్పటి నుంచి అంతా చమురు గురించే మాట్లాడుకుంటున్నారు. మధ్యలో కొన్ని సందర్భాల్లో వాహన దారులు ఇబ్బందులు పడినా ఇప్పటికైతే దేశంలో చమురు కొరత లేదని అంటోంది కేంద్రం. సీఎన్జీ, ఎల్పీజీకి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఇంత అనిశ్చితి ఉన్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురు దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాకపోతే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా ఆ మేరకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలే ప్రస్తుతానికి భరిస్తున్నాయి. కొన్ని లెక్కల ప్రకారం 10 వారాల్లో లక్ష కోట్ల నష్టాలు చవి చూశాయి ఆయా కంపెనీలు. అయితే నిత్యావసర సరుకులను విక్రయించే ఎఫ్ఎమ్సీజీ సంస్థలు మాత్రం త్వరలోనే వినియోగదారులపై ఆర్థిక భారం మోపేందుకు సిద్ధమవుతున్నాయి.
సబ్బులు, డిటర్జెంట్స్, బిస్కెట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, డ్రింక్స్ ప్రియం కానున్నాయి. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ప్యాకేజింగ్ ధరలూ అధికమయ్యాయి. నిజానికి ఈ యుద్ధం మొదలయ్యాక ద్రవ్యోల్బణ ఒత్తిడి తట్టుకునేందుకు ఈ మధ్యే 3-5% మేర ధరలు పెంచాయి సంస్థలు. అయితే ఖర్చులతో పోల్చి చూసినప్పుడు ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ద్రవ్యోల్బణం ఇంకాస్త పెరిగి ఇబ్బందులు తప్పేలా లేవు. అందుకే మరోసారి ధరలు పెంచే యోచనలో ఉన్నాయి. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన చేసే అవకాశముంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ సారి కనీసం 3-7% మేర ధరలు పెంచాలని చూస్తున్నాయి. అంటే ఆ మేరకు వినియోగదారులపై భారం పడనుంది.
అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…సంక్షోభం నుంచి బయట పడాలంటే పొదుపు మంత్రాన్ని జపించాలని సూచిస్తున్నారు. కుండను నింపడానికి ప్రతి చుక్కా ఎంత ముఖ్యమో…ప్రతి చిన్న, పెద్ద ప్రయత్నం కూడా అంతే ముఖ్యం. మనం విదేశాల నుంచి వచ్చే ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించుకోవాలి. మన దైనందిన జీవితంలో దిగుమతి వస్తువులపై అనవసరంగా ఆధారపడటాన్ని మానుకోవాలి. అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేసే వ్యక్తిగత కార్యకలాపాలకు కూడా దూరంగా ఉండాలి. ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్ ప్రారంభంలో పెద్ద ప్రభావం చూపించకపోయినా…రాను రాను తీవ్రంగా చూపిస్తోంది. అమెరికా ఒత్తిడితో రష్యా నుంచి పెట్రోల్ దిగుమతి తగ్గించిన కేంద్రం…ఇరాన్ నుంచి ఎక్కువగా చేసుకుంటోంది. ఇంతలోనే యుద్ధం ప్రారంభం కావడంతో చమురు సరఫరా 90 శాతం ఆగిపోయింది. ఆ తర్వాత గ్యాస్ ట్యాంకర్ల రవాణాలోనూ అంతరాయం ఏర్పడింది. ఈ ఎఫెక్ట్ దేశంలోని అన్ని రంగాలపై తీవ్రంగా చూపుతోంది. వంటింటికి గ్యాస్ కష్టాలు పెరిగిపోయాయి. గ్యాస్ ధరలు ఊహించని విధంగా పెరిగాయి. మున్ముందు ఈ ధరలు మరింత మండిపోయే ప్రమాదం ఉంది.
పశ్చిమాసియాలో యుద్ధంతో అంతర్జాతీయంగా ముడి చమురుధరలు పెరిగి, దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పడుతోంది. ఈ తరుణంలో ప్రతీ పౌరుడు డాలర్ల రూపంలో భారీగా చెల్లింపులు జరిపే పెట్రోల్, డీజిల్, బంగారం, వంట నూనెల వినియోగాన్ని 10 శాతం వరకు తగ్గించుకోవాలి. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో మనం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించడమే కాదు. మన దైనందిన జీవితంలో బాధ్యతాయుతంగా జీవిస్తూ దేశం పట్ల మన బాధ్యతలను నెరవేర్చడం కూడా ఒక రకమైన దేశభక్తే. కొవిడ్ కాలం నుంచి తలెత్తుతున్న ప్రపంచ సైనిక సంఘర్షణల వల్ల చమురు సప్లై మార్గాలకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల ప్రపంచ దేశాల్లో చమురు ధరలు పెరిగాయి. దీంతో డాలర్లు చెల్లించి మన దేశం కొనే చమురులాంటి వనరుల వినియోగంలో ప్రజలు ఆచితూచి వ్యవహరించాలి. చమురు ధరల పెరుగుదల ప్రభావం నుంచి భారతీయ వినియోగదారులను కాపాడటానికి కృషి చేయాలి. మధ్యతరగతి ప్రజల్లో విదేశాలకు వెళ్లడం, విదేశాల్లో సెలవులు గడపడం, డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనే సంస్కృతి పెరుగుతోంది. మనం కనీసం ఒక సంవత్సరం పాటు విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవాలి. విదేశీ కరెన్సీని ఆదా చేయడానికి మనం ఏ మార్గాన్ని అనుసరించగలమో అది చేయాలి.
ప్రస్తుతం ఇంధన ధరలు అస్థిరంగా ఉన్నాయి. ముడి చమురుకు సంబంధించిన ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రవర్తన, సామూహిక క్రమశిక్షణ చాలా అవసరం. ఇందుకోసం అనవసర ప్రయాణాలను తగ్గించాలి. విద్యుత్‌ను ఆదా చేయాలి. ప్రజా రవాణాను ఉపయోగించాలి. డిజిటల్ సమావేశాలను ప్రోత్సహించాలి. ఇంధన వినియోగాన్ని తగ్గించాలి. దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సాధ్యమైతే హైబ్రిడ్ పని విధానాలను అవలంబించాలి. లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలి. మెట్రో సదుపాయం ఉన్న ప్రతిచోటా మెట్రోలనే ఉపయోగించండి. ప్రయాణాల కోసం కార్‌పూలింగ్ అలవాటు చేసుకోండి. వస్తువుల రవాణాకు రైల్వేలను ఆశ్రయించండి. ఇవన్నీ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గిస్తాయి. తద్వారా విదేశీ కరెన్సీపై మనం ఆధారపడటం తగ్గుతుంది. బంగారం కొనుగోలు అనేది విదేశీ కరెన్సీ ఎక్కువగా ఖర్చయ్యే మరో ముఖ్యమైన అంశం. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏడాది పాటు ఇంట్లో ఎలాంటి శుభకార్యం, పండుగలు ఉన్నా సరే మనం బంగారు ఆభరణాలు కొనకూడదని, బంగారం జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకోవాలి.
ప్రధాని మోడీ సూచించిన చర్యలు…భారతదేశం వద్దనున్న విదేశీ మారక ద్రవ్యాన్ని పరిరక్షించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నవే. ప్రస్తుతానికి భారత విదేశీ మారక నిల్వలు తీవ్ర ఒత్తిడిలో లేవు. రాబోయే నెలల్లో ముడి చమురు ధరలు తగ్గకపోతే…అవి అధిక రేంజులోనే కొనసాగితే మన విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే విదేశీ మారక ద్రవ్యంతో మన దేశం కొనే ముడి చమురు, బంగారం లాంటి వాటి వినియోగాన్ని వీలైనంత మేరకు తగ్గించాలి. ఇదొక ముందుజాగ్రత్త చర్య. ఈ రకం వస్తువులు, ఉత్పత్తుల వినియోగంపై ఆంక్షలు, నియంత్రణలు అవసరమయ్యే స్థాయికి పరిస్థితి ఇంకా చేరలేదు. ఇప్పుడు సప్లై చైన్ అంతరాయాలు పెరుగుతున్నాయి. దీనివల్ల సమీప భవిష్యత్తులో ఎరువుల సప్లైకు అంతరాయం రూపంలో అతిపెద్ద సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. పశ్చిమాసియా సంక్షోభం మరింత తీవ్రమైతే, భారతదేశం తగినంత ఎరువుల సరఫరాను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీని ప్రభావం వ్యవసాయ రంగంపైనా పడుతుంది.
పశ్చిమాసియా సంక్షోభం సృష్టించిన ఆర్థిక అనిశ్చితిని తట్టుకునేందుకు పొదుపు చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచిస్తున్నారు. అయితే ఈ సంక్షోభంతో కుదేలైన చాలా దేశాలు ఇప్పటికే పొదుపు చర్యలు అమలు చేస్తున్నాయి. దాదాపు 40కి పైగా దేశాలు నెలరోజులుగా కఠిన పొదుపు చర్యలు పాటిస్తున్నాయి. ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమ్‌కు వెసులుబాటు కల్పిస్తున్నాయి.
ఇంధనాన్ని పొదుపు చేసే ప్రయత్నంలో భాగంగా…ప్రధాని మోడీ స్వయంగా దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. తన అధికారిక కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన కాన్వాయ్‌లోని వాహనాలను సగానికి పైగా తగ్గించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. ఆయన తన కాన్వాయ్‌లోని వాహనాలను అవసరాన్ని బట్టి తగ్గించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా ఇంటిలిజెన్స్ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. అయితే ప్రస్తుతం 9 వాహనాలతో సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కొనసాగుతుంది. చమురు పొదుపు వేళ అది 4 నుంచి 5 వాహనాల వరకు కుదిస్తారని అధికార వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం.
పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాహన కాన్వాయ్ తగ్గింపు చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. తమ కాన్వాయ్‌లలో ఉపయోగించే వాహనాల సంఖ్యను తగ్గించాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇకపై జిల్లాల్లో పర్యటించేటప్పుడూ కాన్వాయ్‌లలోని వాహనాలను సగం తగ్గించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, ఇతర వీఐపీలూ సాధ్యమైనంత తక్కువ వాహనాలను వినియోగించి చమురు పొదుపు అంశాన్ని చూడాలని సూచించారు. అయితే విషయంలో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పబ్లిసిటీ స్టంట్ చేయకుండా క్రమశిక్షణతో వ్యవహరిస్తే ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారు. పొదుపు మంత్రాన్ని జపిస్తారు.
ఇంధన పొదుపు పాటించాలని ప్రధాని మోడీ పిలుపుతో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండు రోజుల వర్క్‌ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. దీంతో పాటు ప్రభుత్వ విభాగాల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించేలా…నో వెహికల్ డే, ఆన్లైన్ సమావేశాల వంటి చర్యలు చేపట్టింది. ఇప్పటికే సీఎం రేఖా గుప్తా తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను నాలుగుకు తగ్గించుకున్నారు. అందులో రెండు విద్యుత్ వాహనాలే. ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు వారానికి రెండు రోజులు ఇంటి నుంచి పనిచేయాలి. 50శాతం అధికారిక సమావేశాలు ఆన్లైన్లో నిర్వహించాలి. అధికారిక వాహనాల వినియోగాన్ని తగ్గించేలా.. మంత్రిత్వ శాఖ అధికారులు ప్రతి సోమవారం మెట్రోలో ప్రయాణించి ఆఫీసులకు రావాలి. ఇందుకోసం ఉద్యోగుల ప్రయాణ భత్యం 10శాతం పెంచింది ఢిల్లీ సర్కార్.
నేడు పొదుపు చేస్తే, రేపటి రోజున అనుకోకుండా సంపాదన ఆగిపోతే.. ఆ డబ్బు ఉపయోగపడుతుంది అని చాలా మంది పొదుపు చేసేవారు. ఇది నిజమే. కానీ ప్రస్తుతం యువత ఆలోచనా ధోరణి మారింది. అత్యవసర పరిస్థితులు, పదవీవిరమణ వంటి వాటి కోసం డబ్బు ఆదా చేయాలి అనే రోజులు పోయాయి. ఆర్థిక స్వాతంత్ర్యం, సంపద సృష్టిపై దృష్టి పెడుతున్నారు. ఈ రెండు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక స్వాతంత్ర్యం భవిష్యత్తులో సంపద ఆర్జనకు సహాయపడుతుంది. ఆర్థిక స్వాతంత్య్రం ఉంటే అవసరమైనప్పుడు ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అయితే, సంపద సృష్టికి ఆర్థిక స్వాతంత్ర్యం ఒక్కటే సరిపోదు. సంపాదన కంటే ఖర్చులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఖర్చుల కంటే పొదుపు ఎక్కువగా ఉండాలి. ఇలా పొదుపు చేసిన మొత్తాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మదుపు చేయాలి. ఒకవేళ పొదుపు తక్కువగా ఉంటే సంపద సృష్టి సాధ్యం కాదా? అంటే సాధ్యమే.
భారతీయులు బంగారానికి ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వరు. పెట్టుబడి కోసం ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేయడం…భారతీయ సంప్రదాయం. ఇంట్లో ఏ చిన్న పంక్షన్ జరిగినా…పుత్తడి కొనుగోలుకు మొగ్గు చూపుతారు. దేశంలో లేనంత బంగారం…మన దేశంలోనే పొగు పడింది. గతంలో బంగారం కొనుగోలు చేశారు మంచిదే. అయితే ఆడంబరాలకు కాకుండా ఇన్వెస్ట్మెంట్గా తీసుకొని…పొదుపు కోసం బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. ఆహారపు అలవాట్లను భారతీయులు కంట్రోల్ చేసుకుంటే…దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆపదలో ఆదుకునే సంపదగా బంగారానికి పేరుంది.
ఆర్థిక విషయాలలో రాణించాలంటే మానసిక ప్రశాంతత చాలా అవసరం. పొదుపు టార్గెట్‌ను చేరుకునేందుకు తప్పనిసరి ఖర్చులను విస్మరించడం సరికాదు. దీని వల్ల ఒత్తిడి పెరగొచ్చు. డబ్బును చిన్న చిన్న మొత్తాలలో దీర్ఘకాలం పాటు నిలకడగా ఆదా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అధిగమించడంతో పాటు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పొదుపు అలవాటు రెగ్యులర్ సేవింగ్స్ అవసరాన్ని తెలియజేయడంతో పాటు, కంఫర్ట్ జోన్లో ఉంటూనే అనవసరమైన ఖర్చులను నివారించడంలో సహాయపడుతుంది. స్టాక్స్, రియల్ ఎస్టేట్, ఇతర స్థిర ఆస్తుల కొనుగోలు అనేది దీర్ఘకాల ప్రక్రియ. ఈ తరహా పెట్టుబడుల కోసం మెరుగైన దీర్ఘకాలిక ప్రణాళిక, వివిధ రకాల పెట్టుబడి మార్గాలపై అవగాహన అవసరం. కానీ పొదుపును మాత్రం నెలవారి బడ్జెట్‌ను అంచనా వేయడం, ఖర్చులను తగ్గించడం, పొదుపు లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, ఆర్థిక ప్రాధాన్యతలను నిర్ణయించడం, వృద్ధిని ట్రాక్ చేయడంతో సులభంగా ప్రారంభించవచ్చు.
తాజావార్తలు
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..