Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాలు…అడగుడగునా బయటపడుతున్నాయి. పదేళ్లలోనే ఏకంగా 93 పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. నీట్ లీకేజ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోచింగ్‌లు తీసుకొని…లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి…అహర్నిశలు శ్రమించి పరీక్షలు రాస్తే…ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయి. కొందరు చేసిన తప్పులకు లక్షల మంది విద్యార్థులు క్షోభను అనుభవిస్తున్నారు. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం…విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. నిద్రాహారాలు మానేసి కష్టపడి పరీక్ష రాస్తే…ప్రశ్నాపత్రం లీక్‌తో అది కాస్త వృథా అవుతోంది. నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్రలో ఓ మహిళను అరెస్టు చేసిన పోలీసులు…సీబీఐకి అప్పగించారు.
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయింది. నెలల తరబడి కష్టపడి చదువుకున్న విద్యార్థుల శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. బాగా చదువుకున్న విద్యార్థులు ర్యాంకులు వస్తాయని…ఇన్ని మార్కులు వస్తాయని లెక్కలు వేసుకున్నారు. తమ కుటుంబసభ్యులకు ఫలానా చోట సీటు వస్తుందని తల్లిదండ్రులకు భరోసారి ఇచ్చారు. అలా పరీక్ష రాసి వచ్చారో లేదో…ఇంతలోనే పేపర్ లీక్ అయిందన్న వార్తలతో అంతా గందరగోళంలో పడిపోయారు. పరీక్షణల నిర్వహణపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అంతకు మించి ఆందోళనలు జరిగాయి. పోటీ పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ విఫలమవుతోందంటూ తల్లిదండ్రులు విరుచుకుపడుతున్నారు. అంతలోనే నీట్ పరీక్ష రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అందుకు కారణం పరీక్షా పత్రం లీక్ అవడమేనని స్పష్టం చేసింది.
Also Read
- Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
- Story Board: ట్రంప్ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్ ఇప్పట్లో కోలుకోవా..?
నీట్ పరీక్షను రద్దుతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ కష్టపడి చదవి పరీక్షలు రాస్తే ఒక్కసారిగా రద్దు నిర్ణయంతో తమ ఆశలు అడియాసలయ్యాయని విద్యార్థులంతా వాపోయారు. మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో పరీక్ష రాస్తామో లేదో అన్న ఆందోళన వారిలో ప్రస్ఫుటంగా వ్యక్తమవుతుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట పరీక్షలు రద్దు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అలాంటిది ఇంత పెద్దఎత్తున రద్దు కావడం విద్యార్థులకు ఎంతో ఇబ్బందికరంగా మారింది. మళ్లీ తమకు పేపర్ ఏ విధంగా వస్తుంది ? దానికి మళ్లీ ఏ విధంగా సన్నద్ధమవ్వాలి ? అనే దానిపై సందిగ్ధంలో పడిపోయారు విద్యార్థులు. ఇన్నాళ్లూ కష్టపడి చదవి పరీక్షలు రాస్తే…ఒక్కసారిగా రద్దు నిర్ణయంతో ఆశలు అడియాసలయ్యాయి. మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో పరీక్ష రాస్తామో లేదోనన్న ఆందోళనలో పడిపోయారు. NTA లెక్కల ప్రకారం…భారత్‌లోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాలను కలిపి సుమారు 5,400కు పైగా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. దీనికి దాదాపు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో మహారాష్ట్రలోని బిబ్వేవాడి ప్రాంతానికి చెందిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను ప్రశ్నించిన తర్వాత సీబీఐ అధికారులకు అప్పగించారు. అయితే పేపర్ లీక్ వ్యవహారంలో ఆమె పాత్ర ఏంటన్న వివరాలను పోలీసులు వెల్లడించలేదు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఆ మహిళను అరెస్టు చేశామన్న పోలీసులు, ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున వారికే అప్పగించినట్లు తెలిపారు. నాశిక్‌కు చెందిన శుభం ప్రశ్నాపత్రం కోసం 10 లక్షలు వెచ్చించాడని, దాన్ని 15 లక్షలకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది.
నీట్ రద్దుపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్న అమృత కాలం…యువత పాలిట విషంగా మారిందన్నారు. నీట్ రద్దుతో 22 లక్షల మంది విద్యార్థుల కలలు ఛిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరో తండ్రులు అప్పులు చేసి పిల్లలను చదివించారని, తల్లులు నగలమ్మి కోచింగ్ ఫీజులు కట్టారని రాహుల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తమ పిల్లలు నీట్ కోచింగ్ ఖర్చు భరించడం కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేశారు. కానీ ప్రతిఫలంగా వారికి పేపర్ లీకులు, ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యా రంగంలో అవినీతితో విద్యార్థులు దారుణంగా నష్టపోతున్నారని విమర్శించారు.
నీట్ పేపర్ లీకవడంపై ఆప్ జాతీయ అధ్యక్షుడు కేజ్రీవాల్ సీరియస్ అయ్యారు. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 93 పోటీ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయన్నారు. మెజారిటీ పేపర్ లీకేజీలు రాజస్థాన్, యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్‌లాంటి బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లోనే జరిగాయన్నారు. దీంతో 6 కోట్ల మంది యువత నష్టపోయారన్న కేజ్రీవాల్…ఈ రాష్ట్రాల్లో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఉండడం కేవలం యాదృచ్ఛికం కాదన్నారు. ఇటీవల నీట్ పేపర్ లీకేజీకి రాజస్థాన్ కేంద్ర బిందువుగా మారిందని పలు నివేదికలు చెబుతున్నాయి. తాజా నీట్‌పేపర్ లీకేజీల్లో సీనియర్ నాయకుల ప్రమేయం ఉందనే అర్థం వచ్చేలా కేజ్రీవాల్ మాట్లాడారు. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఏవైనా దిద్దుబాటు చర్యలు తీసుకోగలదా అని జెన్-జీని ప్రశ్నించారు.
పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కార్యాలయం వెలుపల విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. NTAకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతన ఉండేలా చర్యలు తీసుకోవాలని నినదించారు. ఈ క్రమంలో ABVP సభ్యులు ఎన్టీయే కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడం ఉద్రిక్తతలకు తావిచ్చింది. బారికేడ్ల పైకి ఎక్కినవారిని పోలీసులు వెనక్కి లాగి పడేశారు. శాస్త్రి భవన్ వెలుపల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని NSUI కార్యకర్తలు మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని, NTAను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు నీట్ యూజీ-2026 పరీక్ష రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం రాజస్థాన్‌లో లీకైనట్లు తేలగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఇప్పటికే చెల్లించిన పరీక్ష ఫీజును తిరిగి రీఫండ్ చేయనున్నారు. మళ్లీ నిర్వహించే పరీక్ష కోసం విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్టీఏ తన సొంత వనరులతోనే ఈ పరీక్షను నిర్వహించనుంది. రీ-ఎగ్జామ్ తేదీలు, కొత్త అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తారు. పరీక్ష రద్దు వల్ల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు కలిగే ఇబ్బందిని గుర్తించామన్న ఎన్టీఏ, వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తప్పలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని సూచించింది.
నీట్ ప్రశ్నాపత్రం రాజస్థాన్‌లోని లీక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. పరీక్షలకు రెండ్రోజుల ముందే వాట్సాప్‌లో చక్కర్లు కొట్టినట్లు నిర్దారణ అయింది. కోచింగ్ సెంటర్లకు ఇచ్చిన మెటీరియల్‌తో పోలి ఉన్నట్లు వెల్లడైంది. మొదట ఈ కేసును నమోదు చేయడానికి పోలీసులు వెనుకంజ వేశారు. హస్టల్ యజమాని ఎన్టీఏకు ఫిర్యాదు చేయడంతో…కేసును సీబీఐకి అప్పగించారు. మనీష్, రాకేష్ మంద్వారియాతో సహా రాజస్థాన్‌లో 15 మందిని అరెస్టు చేశారు.
వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కలకలం సృష్టిస్తోంది. పరీక్షకు ముందు రాజస్థాన్‌లో సర్క్యులేట్ అయిన గెస్ మెటీరియల్‌తో పరీక్ష పత్రంలోని పలు ప్రశ్నలు పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దర్యాప్తు చేపట్టడంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్‌లోని కోటాలో నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకైనట్లు గుర్తించారు. కోటాలో కోచింగ్ సెంటర్లు ఇచ్చిన మెటీరియల్‌తో పోలి ఉన్నట్లు తేల్చారు. ప్రశ్నపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పరీక్షకు ముందు రాజస్థాన్‌తో కోచింగ్ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్‌తో పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈనెల 3న జరిగిన పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీసు పేపరును గుర్తించినట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సల్ వెల్లడించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్‌లోని సికార్‌లో నీట్ పరీక్షకు 42 గంటల ముందు వాట్సప్‌లో అందుబాటులోకి వచ్చినట్లు నిర్ధారించారు. దీనిని విద్యార్థులకు 20 వేల నుంచి 2 లక్షల వరకు విక్రయించారన్న ఆయన కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే 30 వేలకు పైగా వసూలు చేశారని గుర్తించామన్నారు.
పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఎన్టీఏ…నీట్ యూజీ-2026కి సంబంధించి అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. తర్వాత కేంద్ర విద్యాశాఖను సంప్రదించి పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఎవరైనా పేపర్ లీక్ చేశారా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే పలు ప్రశ్నలలోని జవాబుల క్రమం కూడా ఒకేలా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ ప్రాక్టీస్ పేపర్ కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థికి చెందినదని తేలినట్లు అధికారులు దర్యాప్తులో వెల్లడైంది. అతను మే 1న సికార్‌లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్ ఇచ్చాడని.. ఆ తర్వాత అది పీజీ వసతిగృహాలు, కోచింగ్ నెట్‌వర్క్‌లు, కెరీర్ కౌన్సెలర్లు, పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చేరిందని వెల్లడించారు. ఆ మెటీరియల్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నాయి.
నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు ఎన్టీఏకు మే 7న సమాచారం అందింది. పరీక్ష నిర్వహించక ముందే సదరు వ్యక్తికి వాట్సాప్ మెసేజ్ వచ్చిందని ఎన్టీఏ తెలిపింది. మే 3న పరీక్ష జరగడానికి ముందే ఈ పీడీఎఫ్ ఫైల్ లీక్ అయ్యిందా ? లేదా ? అనే అంశాన్ని ఎన్టీఏ అనేది పరిశీలించినట్లు ఎన్టీఏ డీజీ వెల్లడించారు. తాము చేసిన తనిఖీలో కొన్ని ప్రశ్నలు, మా ప్రశ్నాపత్రంతో సరిపోలినట్లు అంగీకరించారు. మే 1, 2 తేదీల్లోనే ఆ పీడీఎఫ్ ఫైల్ కొందరి ఫోన్లలో ఉందని…ఈ పరిణామం మా ఏజెన్సీ జీరో టాలరెన్స్ పాలసీని ఉల్లంఘించడమే స్పష్టం చేసింది. ఇది ఎన్టీఏ విధానాలకు పూర్తిగా వ్యతిరేకమన్న డీజీ… పరీక్ష కోసం కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్‌పై ఇది ప్రభావం చూపుతుందన్నారు.
రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన ఓ విద్యార్థి కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. నీట్ పరీక్ష జరగడానికి కొన్ని గంటల ముందు.. అంటే మే 2వ తేదీ రాత్రి 11 గంటలకు అతడికి సికార్‌లోని ఓ స్నేహితుడి నుంచి పీడీఎఫ్ ఫార్మాట్లో నీట్ పరీక్షకు అవసరమయ్యే ప్రశ్నపత్నం వచ్చింది. గెస్ పేపర్‌తో వచ్చిన ఆ ప్రశ్నపత్రాన్ని సదరు విద్యార్థి రాజస్థాన్‌లోని తన తండ్రికి పంపించాడు. ఆ విద్యార్థి తండ్రి స్థానికంగా హాస్టల్ నిర్వహిస్తున్నాడు. మర్నాడు ఉదయం కొడుకు నుంచి మెసేజ్ చూసిన ఆ హాస్టల్ యజమాని.. ఈ విషయాన్ని తనకు తెలిసిన ఓ కెమిస్ట్రీ అధ్యాయపకుడి దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటికే దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రారంభమైంది. దీంతో ఆ టీచర్ అసలైన ప్రశ్నపత్రంతో ఈ గెస్ పేపర్‌ను పోల్చగా.. దాదాపు 108 ప్రశ్నలు ఒకేలా ఉండటం గుర్తించారు. ఆ తర్వాత బయాలజీ పేపర్ చూడగా.. అందులోనూ చాలావరకు ప్రశ్నలు ఒకేలా ఉండటంతో పేపర్ లీక్ జరిగిఉండొచ్చని అనుమానం మొదలైంది. దీంతో ఆ కెమిస్ట్రీ టీచర్, హాస్టల్ యజమాని కలిసి పోలీసుల వద్దకు వెళ్లడంతో ఈ లీకేజీ వ్యవహారం బయటపడిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
తొలుత ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసేందుకు సికార్ పోలీసులు నిరాకరించారు. దీంతో ఆ హాస్టల్ యజమాని, కెమిస్ట్రీ టీచర్ కలిసి ఎన్టీఏకి మెయిల్ పంపించారు. అప్పటికే పరీక్ష జరిగి నాలుగు రోజులు గడిచింది. దీంతో ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఎన్టీఏ.. ఇంటిలిజెన్స్ బ్యూరో సాయం కోరింది. వారి సూచనల మేరకు రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దీనిపై దర్యాప్తు చేపట్టగా.. లీకేజీ గుట్టు వెలుగులోకి వచ్చింది. భద్రతా కారణాల రీత్యా ఆ హాస్టల్ యజమాని, ఆయన కుమారుడు, కెమిస్ట్రీ టీచర్ వివరాలను పోలీసులు బహిర్గతం చేయలేదు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా కీలక విషయాలు బయటికొస్తున్నాయి. రాజస్థాన్‌లోని జమ్వా రామ్‌గఢ్ ప్రాంతానికి చెందిన సోదరులు మంగీలాల్, దినేశ్ బివాల్ ఈ నీట్ ప్రశ్నపత్రాన్ని ఏప్రిల్ 26న గురుగ్రామ్‌కు చెందిన వైద్యుడి నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సోదరుల్లో ఒకరి కుమారుడు నీట్ పరీక్ష కోసం సిద్ధమవుతుండగా ఆ పేపర్‌ను అతడికి పంపించారు. అనంతరం ఏప్రిల్ 29న ఈ ప్రశ్నపత్రాన్ని వీరు కొంతమందికి విక్రయించినట్లు దర్యాప్తులో తెలిసింది. బిహార్, జమ్మూకశ్మీర్, హరియాణా తదితర రాష్ట్రాల్లోని అభ్యర్థులకు ఈ పేపర్ చేరినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
ఎన్టీఏ ఏర్పాటైనప్పటి నుంచి ఏనాడు బాధ్యతగా వ్యవహరించలేదు. గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులకు మార్కులు కలిపేస్తుంది. ఒకే సెంటర్లో ఎక్కువ మంది విద్యార్థులకు ఒకే రకంగా మార్కులు వచ్చినా పట్టించుకోలేదు. కొన్ని ప్రశ్నలను కీ నుంచి తొలగించి…వివాదాలను కొని తెచ్చుకుంది.
ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో సీట్ కోసం కొందరు. కలల కోర్సులో చేరాలని మరి కొందరు. ఫ్యూచర్ ఎలా ఉండాలో ముందుగా లెక్కలు వేసుకుని దానికి తగ్గట్టుగా సన్నద్ధమయ్యే వారు ఇంకొందరు. ఇలా అనేక మంది విద్యార్థుల ఆశలు, అంచనాలు తలకిందులవుతున్నాయి. కారణం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పని తీరు. ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణకు తొమ్మిదేళ్ల క్రితం ఏర్పాటైంది ఈ సంస్థ. అప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఓ వివాదం. పరీక్ష పత్రాల్లో ప్రశ్నలు మార్చేసి ఓ సారి, సమాధానాలు మార్చేసి మరోసారి ఇలా ఇష్టమొచ్చినట్టుగా విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుతోంది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం నేషనల్ వైడ్‌గా సంచలనమైంది. ఈ వ్యవహారం పరీక్ష రద్దు వరకూ వెళ్లింది. సీబీఐతో దర్యాప్తు చేయిస్తామని కేంద్రం ప్రకటన అయితే చేసింది. అడుసు తొక్కనేల కాళ్లు కడగనేల అన్నట్టు అసలు తప్పులు జరిగే వరకూ చూడడం ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఎన్టీఏ ఏనాడూ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. 2017లో కేంద్రం ఈ సంస్థను ఏర్పాటు చేసింది. జేఈఈ, నీట్, యూజీసీ-నెట్ లాంటి ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల నిర్వహించడమే అసలు బాధ్యత. ఐఐటీలు, ఎన్ఐటీలు, సెంట్రల్ వర్సిటీలతో పాటు వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించిన పరీక్షలన్నీ ఈ ఎన్టీఏ సంస్థే నిర్వహిస్తుంది. సీబీఎస్ఈ, ఏఐసీటీఈ పైన పరీక్షల నిర్వహణ భారం తగ్గించి పూర్తిగా అకడమిక్స్‌పై దృష్టి సారించాలన్న ఉద్దేశంతో ఏర్పాటైంది. ఇంరా చెప్పాలంటే కేంద్రం అత్యంత పెద్ద బాధ్యత అప్పగించింది. కానీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏనాడూ ఈ సంస్థ బాధ్యతాయుతంగా పని చేసిన దాఖలాలు లేవు. ఇదేదో గాలివాటంగా చేస్తున్న విమర్శ కాదు. కొన్నాళ్లుగా నెలకొన్న వివాదాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై కొంతకాలంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌కు సంబంధించి కెమిస్ట్రీ పేపర్ ఆన్సర్ కీ ఏప్రిల్ 11న విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అయితే ఈ కీ పేపర్ మొత్తం తప్పులతడకగా ఉందని అభ్యర్థులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దీని వల్ల కనీసం 10-20 మార్కులు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ అందరూ పోస్ట్‌లు పెట్టారు. అప్పుడు అప్రమత్తమైన ఎన్టీఏ, కీని రివైజ్ చేసి ఏప్రిల్ 12వ తేదీన మరోసారి విడుదల చేసింది. అందులో 19 ప్రశ్నలను కరెక్ట్ చేసింది. ఆ సమయంలోనూ సోషల్ మీడియాలో ఓ పెద్ద పోస్ట్ పెట్టింది ఎన్టీఏ. ఆ సమయంలో అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. అత్యంత కీలకమైన జేఈఈ పరీక్ష కీ విషయంలో ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉంటారంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు వెల్లువెత్తాయి. ఒక్క మార్కుతోనే తలరాతలు మారిపోతుంటాయి. అంత ముఖ్యమైన పరీక్షల విషయంలో ఇంత నిర్లక్ష్యం ఏంటని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎన్టీఏలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు.
తప్పులు చేయడం, వాటిని సరిదిద్దుకోవడం ఎన్టీఏకి కొత్తేమీ కాదు. అంతకు ముందు కూడా 2025లో జేఈఈ మెయిన్స్ పరీక్ష విషయంలో ఇదే జరిగింది. ఫైనల్ ఆన్సర్ కీ అంతా గందరగోళంగా ఉందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో మళ్లీ దాన్ని మార్చడమే కాకుండా 12 ప్రశ్నలు పూర్తిగా తొలగించింది. సమాధానాలు ఇచ్చిన ప్రశ్నలను అన్ఆన్సర్డ్ జాబితాలోకి చేర్చడంతో గందరగోళానికి దారి తీసింది. అసలు సిలబస్‌తో సంబంధం లేని ప్రశ్నలు వచ్చాయనీ గతేడాది జేఈఈ మెయిన్స్‌పై ఫిర్యాదు వచ్చింది. అంటే ఏటా ఏదో విధంగా ఈ తరహా సమస్యలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయినా ఏ మాత్రం చలనం లేకపోవడమే అభ్యర్థుల్లో నిరాశ, నిస్ఫృహలకు కారణమవుతోంది. 2024లో తలెత్తిన వివాదం NTA పని తీరుని కళ్లకు కట్టింది. ఇప్పుడు నీట్ పరీక్ష గురించి ఎలాగైతే నేషనల్ వైడ్ ఆందోళన వ్యక్తం అవుతోందో అప్పుడు కూడా ఇదే జరిగింది. నీట్-యూజీ పరీక్షా పేపర్ లీక్ అయిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఫలితాలు వచ్చిన తరువాత ఈ ఆందోళన మరింత పెరిగింది.
గతంలో అనేక పరీక్షల నిర్వహణలో విమర్శలు ఎదుర్కొన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ…ఈ నీట్ వ్యవహారంలోనూ నిలువెల్లా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాదాపు 67 మంది అభ్యర్థులకు 720కి 720 మార్కులు రావడం అనుమానాలకు తావిచ్చింది. 67 మంది విద్యార్థులకు ఒకే రకంగా మార్కులు రావడం ఒకెత్తయితే…అది కూడా ఒకే సెంటర్లో…ఒకే రూంలో పరీక్ష రాసిన వారికి రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అనుమానాలకు మరింత బలచేకూర్చింది. 2024లో నీట్ ఫలితాలను వెల్లడిస్తున్నట్లు కనీసం గంట ముందు కూడా ఎన్టీఏ అధికారికంగా ప్రకటన చేయలేదు. జూన్ పదవ తేదీన ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటే…4వ తేదీనే ప్రకటించింది. అది కూడా ఎలాంటి చడీచప్పుడు లేకుండా విడుదల చేయడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. దేశ ప్రజలంతా ఎన్నికల ఫలితాల్లో నిమగ్నమైతే…ఎన్టీఏ మాత్రం సైలెంట్‌గా తన పని కానిచ్చేసింది. 20 పేజీలతో ప్రకటనను జారీ చేసిన ఎన్టీఏ…1,563 మందికి గ్రేస్ మార్కులు కలిపిన అంశాన్ని దాచి పెట్టింది. దీంతో నీట్ ఫలితాల్లో ఏదో తేడా జరిగిందన్న వాదనలకు మరింత చేకూర్చింది.
సాధారణంగా జాతీయస్థాయిలో నిర్వహించి పోటీ పరీక్షల్లో…అనేక సందర్బాల్లో ఇద్దరు ముగ్గురు విద్యార్థులకు ఒకే ర్యాంక్ వస్తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం… 2024లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేసింది. ఇక్కడే విద్యార్థులకు పరీక్ష నిర్వహణపై అనుమానం మొదలైంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రోడ్డెక్కారు. వాస్తవంగా ఫలితాలు ప్రకటించిన రోజే…గ్రేస్ మార్కుల విషయాన్ని చెప్పి ఉంటే…ఎన్టీఏపై నమ్మకం పెరిగేది. ఆ విషయాన్ని బహిర్గతం చేయకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఇలా వరుస పేపర్ లీకేజ్‌లు…ప్రశ్నల్లో తప్పులు…ఫలితాల ప్రకటనల్లో గందరగోళంతో…నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!