తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో, ఆహర సంక్షోభంలో చిక్కుకుంది ద్వీపదేశం శ్రీలంక. గత కొన్ని నెలల నుంచి శ్రీలంక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. స్వాతంత్ర్యం పొందిన 1948 నుంచి ఇప్పుడే అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. ఇటీవల నిరసనలు హింసాత్మకంగా మారడంతో చివరకు ప్రధాని గా ఉన్న మహిందా రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే అధికారం చేపట్టారు. ఐదు సార్లు ప్రధానిగా పనిచేసిన అనుభవంతో ఈ సమస్యను నుంచి శ్రీలంకను బయటపడేయాలని అంతా కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి కారణం అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, మాజీ ప్రధాని మహిందా రాజపక్సే అని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో వీరిద్దరు రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని పదవికి మహీందా రాజపక్సే రాజీనామా చేయగా… అధ్యక్షుడు గోటబయ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఈ రోజు అధ్యక్షుడు గోటబయపై పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. గోటబయ రాజపక్సేను వ్యతిరేఖిస్తూ… తమిళ్ నేషనల్ అలయన్స్( టీఎన్ఏ) ఎంపీ ఎంఏ సుమంథిరన్ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి మద్దతుగా ప్రధాన ప్రతిపక్షం ఎస్జేబీ ఎంపీ లక్ష్మణ్ కిరియెల్లా నిలిచారు. అయితే ప్రధాన మంత్రి విక్రమసింఘే మాత్రం అవిశ్వాసానికి వ్యతిరేఖంగా ఓటేశారని సమాచారం. 119 మంది ఏంపీలు అవిశ్వాసాన్ని వ్యతిరేఖించగా… 68 మంది మాత్రమే మద్దతు తెలిపారు. దీంతో అధ్యక్షుడు గోటబయపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది.
ఇదిలా ఉంటే శ్రీలంకలో పెట్రోల్ నిల్వలు అడుగంటుకుపోయాయి. అన్ని పెట్రోల్ బంకుల వద్ద నోస్టాక్ బోర్డ్ కనిపిస్తోంది. పెట్రోల్ దొరుకుతుందనే ఆశతో ప్రజలు పెద్ద ఎత్తున బంకుల ముందు క్యూలైన్లలో నిలుచున్నారు. ఇదిలా ఉంటే కొత్తగా అధికారం చేపట్టిన ప్రధాని రణిల్ విక్రమసింఘే కేవలం ఒక్క రోజుకు సరిపడే పెట్రోల్ మాత్రమే దేశంలో ఉందని ప్రజలకు తెలిపాడు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ప్రైవేటీకరణను చేపట్టాలని చూస్తున్నాడు. శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ ను ప్రైవేటీకరణ చేస్తామని ప్రధాని రణిల్ ప్రకటించారు. తీవ్ర నష్టాల్లో ఉన్న శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ ను ఒడ్డున పడేయాలంటే ప్రైవేటీకరణ ఒక్కటే మార్గమని ఆయన అన్నారు.