Telangana Assembly Election 2023: తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రజల మన్ననలందుకున్న బీఆర్ఎస్‌కు గట్టిషాక్ తగిలింది. రాష్ట్రంకోసం ఏర్పడిన పార్టీ, ఉద్యమనేత కేసీఆర్‌ను ఎవరూ వదులుకోరని ధీమాగా ఉన్న గులాబీపార్టీకి ప్రజలు ఊహించని షాకిచ్చారు. కనీసం బొటాబొటి మెజార్టీ వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని భావించిన కేసీఆర్ అండ్‌కోకు ఛాన్స్ లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ కట్టబెట్టారు. బీఆర్ఎస్ ఓటమి వెనక చాలా కారణాలు కనిపిస్తున్నాయి.
* ముఖ్యంగా BRS నేతల అహంకారం అంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం.. జనంపై చాలా ప్రభావం చూపింది.దొరల తెలంగాణ కూల్చి ప్రజల తెలంగాణ తెచ్చుకుందామన్న నినాదంఉధృతంగా వినిపించింది.
నియామకాల అంశం తెలంగాణ ఉద్యమంలో ప్రధానాంశం. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దసంఖ్యలో ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఉంటుందని .. తెలంగాణ యువత ఆశపడింది. 6యూనివర్సిటీల్లో విద్యార్థులు సైతం జాబ్ క్యాలెండర్ కావాలని, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కులవృత్తులు చేసుకుంటే సరిపోతుందన్న కొందరు మంత్రుల వ్యాఖ్యలు ,టీఎస్‌పీఎస్‌సీ లీకుల పర్వం.. అగ్నికి ఆజ్యం పోశాయి. సంవత్సరాల తరబడి హాస్టల్స్ ఫీజులు, ఖర్చులు భరించి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి పరీక్షలకు ప్రిపేరైతే.. లీకులు వారి సహనాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రవల్లిక ఎపిసోడ్.. నిరుద్యోగుల్ని మరింత రగిలింప చేసింది.
* ఎన్నికలకు ముందు చక్కని ప్రచారాస్త్రమవుతుందని భావించిన కాళేశ్వరం.. బీఆర్ఎస్ సర్కార్‌ను గట్టి దెబ్బ తీసింది. కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ బ్యారెజ్ పిల్లర్ల కుంగుబాటు అంశం.. బీఆర్ఎస్ అవినీతికి ప్రతీకని విపక్షాలు తీవ్రంగా దాడి చేశాయి. ఈవిమర్శలతో అధికార పార్టీ గుక్క తిప్పుకోలేకపోయింది. ఫలితంగా అవినీతికి.. కాళేశ్వరం నిర్మాణం అడ్డా అని విపక్షాలుచేసిన ప్రచారం.. బలంగా ప్రజల్లోకి వెళ్లింది. దీనికి తోడు ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించడం, కమిటీ వేయడం.. ఈ అవినీతి అంశాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసింది. దీంతో బీఆర్ఎస్ సర్కార్ ఆత్మరక్షణలో పడింది.
* ఇక బీఆర్ఎస్‌లో కొందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముత్తిరెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కోర్టుల్లోనూ కేసులు నమోదయ్యాయి. దీంతో అవినీతి సర్కార్.. కమిషన్ సర్కార్.. అందుకే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదంటూ విపక్షాలు తూర్పారబట్టాయి. వీటిని తిప్పికొట్టేందుకు విపక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
* మరీ ముఖ్యంగా చాలా ముందుగా అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. వారిలో చాలా మందిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. అంతేకాదు.. పలానా ఎమ్మెల్యే తమను తీవ్రంగా వేధించారని, వారికి టికెట్ ఇవ్వొద్దని సాక్షాత్తూ కార్యకర్తలే.. హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. వారి డిమాండ్లను పరిష్కరించడం మాట అటుంచి, తిరిగి తాము వదన్న వారికే టికెట్ ఇవ్వడంతో.. కొందరు కార్యకర్తలు తమ అభ్యర్థుల తరపున పనిచేసేందుకు ఇష్టపడలేదు. ఇది కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటములకు కారణంగా చెబుతున్నారు.జనగామ, ఘన్‌పూర్‌లలో బీఆర్ఎస్ గెలవడాన్ని బట్టి.. కార్యకర్తల ఆలోచన అర్థమవుతుంది.
* స్థానిక నేతల మధ్య విబేధాలు.. బీఆర్ఎస్ ఓటమికి ఓ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తమను ఓడించేందుకు పార్టీలోని పెద్దవ్యక్తులే .. కుట్రలకు పాల్పడుతున్నారని.. కొందరు అభ్యర్థులు, టికెట్ ఆశించిన వ్యక్తులు ఆరోపించారు. అంతే కాదు.. తమ భవిష్యత్తును దెబ్బతీసేందుకు కుట్రలు పన్నారని వాపోయారు. అసలు వారికి టికెట్ ఇస్తే తాము పనిచేసేదే లేదన్నారు. వారితో సమావేశమైన బీఆర్ఎస్ పెద్దలు.. తాత్కాలికంగా సర్దుబాటు చేయించారన్న విమర్శలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. అప్పటికి సర్దుకుపోయినట్లు నేతలు కనిపించినా.. కార్యకర్తలు మాత్రం ప్రత్యర్థులతో కలిసి పనిచేయలేకపోయారన్న వాదనలు వినిపించాయి.
* ఇక మరికొందరు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు.. టికెట్ ఆశించి భంగపడ్డారు. తమ రాజకీయ ప్రస్థానం తెలిసి కూడా తమను తక్కువగా తీసివేయడాన్ని సహించలేకపోయారు. పొంగులేటి, తుమ్మల, ఈటల లాంటి వారు.. గులాబీ పార్టీ అధినేత వైఖరితో ఇతర పార్టీలకు వలసపోయారు. అంతేకాదు.. బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ ప్రతిజ్ఞలు చేశారు. ఆదిశగా వారు గట్టిగానే కృషి చేశారు. ఫలితంగా ఖమ్మం లాంటి చోట్ల బీఆర్ఎస్ చతికిలపడింది.
* బీజేపీ బీటీమ్ బీఆర్ఎస్ అంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం ప్రజల దృష్టిని ఆకర్షించింది. అందుకే తీవ్ర అవినీతికి పాల్పడిన కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై కేంద్రసంస్థలు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. దీనికి తగ్గట్లుగానే ఇతర పార్టీల నేతలపై ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు దాడి చేసినా.. బీఆర్ఎస్ నేతల ఆస్తులపై దాడులు జరగకపోవడం.. కాంగ్రెస్ నేతల వాదనలకు బలం చేకూర్చింది. అదే సమయంలో బండి సంజయ్‌ను.. బీజేపీ అధ్యక్షుడి పోస్టు నుంచి తొలగించడం కూడా… దీనిలో భాగమంటూ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ తదితరులు తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌తో ఒప్పందంలో భాగంగా బండి సంజయ్‌ను .. అధ్యక్ష పదవి నుంచి తొలగించారని ఆరోపణలు గుప్పించారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అంటూ బీజేపీ, బీఆర్ఎస్‌తీరును తూర్పారబట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరైన కవితను అరెస్ట్ చేయలేదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారం ప్రజలకు చేరింది. ఢిల్లీలో డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఈడీ .. కవిత జోలికి ఎందుకు రావడం లేదంటూ రాహుల్ ప్రశ్నలకు.. బీఆర్ఎస్ నేతల దగ్గర బదులు లేకుండాపోయింది.
* కేసీఆర్ మానసపుత్రికగా చెప్పుకున్న ధరణి.. గ్రామాల్లో రైతులకు సమస్యాత్మకమైంది. ధరణిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ నేతల అవినీతికి కేరాఫ్‌గా ధరణి మారిందని కాంగ్రెస్, బీజేపీ విమర్శించాయి. దీనికి తోడు కేసీఆర్ సర్కార్ ఆర్భాటంగా మొదలుపెట్టిన దళితబంధు.. గ్రామంలో అతికొద్దిమందికి అందడం సమస్యగా మారింది. దీంతో బీఆర్ఎస్ అనుకూలురు, కార్యకర్తలకే దళితబంధు ఇస్తున్నారని .. ఆసామాజికవర్గంలో విమర్శలు వెల్లువెత్తాయి. రైతు బంధు నిలుపుదలపైనా రాజకీయం తీవ్రమైంది. కాంగ్రెస్ ఆపించిందని బీఆర్ఎస్ చెబితే.. బీఆర్ఎస్ నేతల మాటలతోనే రైతు బంధు ఆగిందని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలున్నట్లు.. బీఆర్ఎస్ ఓటమి వెనక చాలా కారణాలున్నాయని చెప్పక తప్పదు.