వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌ను 2-1తో గెలుచుకున్న భారత మహిళా జట్టు.. మూడు వన్డేల సిరీస్‌లోనూ బోణీ కొట్టింది. వదోదర వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో 211 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. 315 పరుగుల ఛేదనలో విండీస్ 26.2 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయింది. అఫీ ఫ్లెచర్ (24) టాప్ స్కోరర్. భారత బౌలర్ రేణుక సింగ్ (5/29) ఐదు వికెట్స్ పడగొట్టింది. రేణుకకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. డిసెంబర్ 24న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (91; 102 బంతుల్లో 13×4), ప్రతీక రావల్ (40; 69 బంతుల్లో 4×4)లు తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించారు. రావల్ అనంతరం హర్లీన్ డియోల్ (44) దూకుడుగా ఆడింది. సెంచరీ చేసేలా కనిపించిన స్మృతి 91 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బీగా వెనుదిరిగింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), జెమీమా రోడ్రిగ్స్ (31) రాణించడంతో భారత్ స్కోరు 300 దాటింది. విండీస్ బౌలర్లలో జైదా జేమ్స్ (5/45) ఐదు వికెట్స్ తీసింది.
భారీ ఛేదనలో విండీస్ ఆరంభం నుంచే తడబడింది. తొలి బంతికే ఓపెనర్ కియానా జోసెఫ్ రనౌట్ అయింది. రేణుక సింగ్ చెలరేగడంతో 26 పరుగులకే 5 వికెట్స్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. షిమైన్ క్యాంప్‌బెల్ (21), అఫీ ఫ్లెచర్ (24), అలియా (13), కరిష్మా (11) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. భారత బౌలర్లలో రేణుకతో పాటు ప్రియ మిశ్రా (2/22), దీప్తిశర్మ (1/19) రాణించారు. వన్డేల్లో పరుగుల పరంగా భారత్‌కు ఇది రెండో పెద్ద విజయం. అంతకుందు 2017లో ఐర్లాండ్‌పై 249 పరుగుల తేడాతో గెలిచింది.