Unfathomable Tragedy: ఆ చిన్నారి ఉదయాన్నే నిద్ర లేచింది. తలంటు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంది. పుట్టినరోజు కావడంతో కుటుంబసభ్యుల తీసుకుంది. పాఠశాలకు వెళ్లి అందరికి చాకెట్లు పంచింది. అయితే.. ఆ చిట్టితల్లికి తెలియదు.. పుట్టిన రోజే తనకు ఆఖరి రోజు అవుతుందని. పుట్టిన రోజున ఆనందంగా గడిపిన ఆ చిన్నారి విషాదకర రీతిలో మృతి చెందింది. తరగతి గదిలో నాపరాయి మీద పడడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగింది. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి చెందడం స్థానికులను కలచివేసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంతకల్లులో అంకాలమ్మ వీధిలో నివసిస్తున్న శిరీష, రంగా దంపతుల కూతురు కీర్తన(4) స్థానికంగా శ్రీవిద్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో యూకేజీ చదువుతోంది. శుక్రవారం పుట్టినరోజు కావడంతో ఆనందంగా పాఠశాలకు వచ్చింది. తోటి చిన్నారులకు చాక్లెట్లు పంచి ఆనందంగా గడిపింది. ఆ తర్వాత అలసిపోయి తరగతి గదిలోనే సేదతీరింది. చిన్నారి పడుకున్న ఉన్న సమయంలో నాపరాయి మీద పడడంతో తీవ్రగాయాల పాలైంది. రక్తమోడుతున్న చిన్నారిని వెంటనే గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Also Read: Viral Couple Apology: సీపీ సీవీ ఆనంద్ను కలిసి క్షమాపణలు చెప్పిన పోలీసు జంట
అప్పటిదాకా ఆనందంగా గడిపిన తమ చిన్నారిని విగతజీవిగా చూసి కీర్తన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అది అక్కడున్న వారందరినీ కదిలించింది. పుట్టినరోజు నాడే చిన్నారి మృతి చెందడంతో ఆ పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. పాఠశాల నిర్వాహకుల వల్లే తమ చిన్నారి మృతిచెందిందంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారి మృతి గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. చిన్నారి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.