తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ రైతాంగం, ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలు ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 606 మండలాల నుంచి ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో మధ్యాహ్నం 1 గంటకు ఈ పథకాలను ఒకేసారి ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 1 నుండి మార్చి 31 మధ్య రాష్ట్రం మొత్తం కవర్ చేయనున్నారు. కాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. నాలుగు సంక్షేమ పథకాలు మండలంలోని ఒక గ్రామంలో మధ్యాహ్నం 1 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందులో భాగంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఈ పథకాలను ప్రారంభించనున్నారు. ఎవరెవరు ఏ జిల్లాల్లోని గ్రామాల్లో పథకాలు ప్రారంభించనున్నారో తెలుసుకుందాం……….
Read Also: Lady Aghori: కరీంనగర్ బైపాస్ రోడ్డులో అఘోరీ హల్‌చల్..
నారాయణ పేట జిల్లా కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు జారీ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఖమ్మం జిల్లా కొణిజర్లలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాలుగు పథకాలు ప్రారంభించనున్నారు.
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొహెడ మండలంలోని పోరెడ్డిపల్లి గ్రామంలో 4 పథకాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం మంజుపల్లిలో ప్రభుత్వ పథకాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు.
నల్గొండ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించనున్నారు.
మలుగు జిల్లా జీవంతరావుపల్లిలో ప్రభుత్వ పథకాలను మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు.
కొల్లాపూర్‌లో నిర్వహించనున్న ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారు.