ఆహార పదార్థాల్ని కల్తీ చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాసనసభలో సభ్యులు ఆహార కల్తీపై సంధించిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. మానవ వినియోగానికి సంబంధించిన ఆహార వస్తువుల అమ్మకం, నిల్వ, పంపిణీ దిగుమతుల వంటివాటి నియంత్రణ, పర్యవేక్షణకు సంబంధించి 2006 నాటి ఆహార భద్రత, ప్రమాణాల చట్ట నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ చట్టం రాష్ట్రంలో ఆహార భద్రతా అధికారుల ఆధ్వర్యంలో అమలవుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఆహార భద్రతా కమీషనర్, జిల్లాలోని అధికారులు, ఇతర చట్టబద్ధమైన కార్యనిర్వాహక అధికారులు, అడ్జుడికేటింగ్ అధికారి, ఫుడ్ సేఫ్టీ ట్రిబ్యునల్, ప్రత్యేక కోర్ట్ వంటి విభాగాలు ఈ చట్టం అమలును పర్యవేక్షిస్తున్నాయని వివరించారు. ఆహార భద్రతకు నియమించిన అధికారులు తినుబండారాలను, వారి సంబంధిత అధికార పరిధిలో ఉన్న తయారీదారులు, హోల్ సేలర్లు, రిటైలర్ల వంటి వారిని క్రమంతప్పకుండా తనిఖీ చేస్తున్నారని చెప్పారు. ఆహార నమూనాలను సేకరించి సమీప ప్రయోగశాలల్లో పరిశీలిస్తున్నారని, 2006 ఆహార భద్రతా ప్రమాణా చట్ట నిబంధనల ప్రకారం సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని వివరించారు.
కల్తీ ఆహారం తినటం వల్ల మరణిస్తే జైలు శిక్ష ఏడేళ్ల కంటే తక్కువగా వుండరాదని చట్టం నిరందేశించిందని, దీనిని జీవిత ఖైదు వరకూ పొడిగించేందుకు అవకాశం కల్పిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దీనితో పాటు రు.10 లక్షలకు పైబడిన జరిమానా కూడా విధించవచ్చన్నారు. ఇప్పటి వరకూ దాదాపు 1,365 చిన్న నేరాల కేసులను, పెద్ద నేరాలకు సంబంధించి 110 కేసులను జాయింట్ కలెక్టర్, అడ్జుడికేటింట్ అధికారి నిర్ణయించారని.. రెండు సందర్భాలలో మొత్తం రు.1.69 కోట్ల మేర జరిమానా విధించారని మంత్రి సత్యకుమార్ తన సమాధానంలో వివరించారు.