Sania Mirza: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్ జరుగుతోంది. సానియా రెండు మ్యాచ్‌లను ఆడనుంది. సింగిల్స్‌లో సానియా vs రోహన్ బోపన్న ఆడనుండగా.. డబుల్స్‌లో సానియా, బోపన్న జోడీ vs ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ ఆడనున్నారు. సానియా చివరి మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన స్పోర్ట్స్ స్టార్స్, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు తరలివచ్చారు. సానియా తన 20 ఏళ్ల కెరీర్‌లో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, 43 డబ్ల్యూటీఏ టైటిల్స్ గెలుచుకుంది. డబుల్స్‌లో 91 వారాల పాటు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌లో సానియా నిలిచింది. సానియా మీర్జా ఏసియన్ గేమ్స్‌లో 8, కామన్వెల్త్ గేమ్స్‌లో 2 మెడల్స్ సాధించింది. అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్నతోపాటు.. అర్జున, పద్మ భూషణ్, పద్మ శ్రీ అవార్డులను సానియా అందుకుంది. ప్రస్తుతం విమెన్స్ ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ టీమ్‌కు మెంటర్‌గా సానియా ఉన్నారు. సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్‌లో రెడ్ కార్పెట్ ఈవెంట్.. గాలా డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఏఆర్ రెహమాన్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ తోపాటు మరికొందరు స్పోర్ట్స్, సినిమా స్టార్స్ హాజరుకానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్రమంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, క్రికెటర్ యువరాజ్ సింగ్, హీరో దుల్కర్ సల్మాన్ పలువురు ప్రముఖులు వీక్షిస్తున్నారు. మ్యాచ్ జరుగుతుండగా యువరాజ్ కోసం ఓ అభిమాని పరుగులు తీయగా.. యువీ అతని క్యాప్ మీద సంతకం ఇచ్చి ఆనందపరిచాడు.
Read Also: Medico Preeti Case: మెడికో ప్రీతిది ఆత్మహత్యా? లేదా హత్యా?.. ఇంకా వీడని మిస్టరీ
”అభిమానుల కోసం చివరి మ్యాచ్ ఆడుతున్నా. 20 ఏళ్ల క్రితం నేను ఎక్కడ టెన్నిస్ ప్రాక్టీస్ చేశానో.. అక్కడే ఆఖరి మ్యాచ్ ఆడనున్నా. ఈ మ్యాచ్ చూసేందుకు నా కుటుంబ సభ్యులు, స్నేహితులు వస్తున్నారు. కెరీర్‌లో చివరి మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. విజయంతో కెరీర్‌ను ముగించాలని అనుకుంటున్నా. నా కుమారుడు, కుటుంబంతో సమయం కేటాయించాలని అనుకుంటున్నా.” -భావోద్వేగానికి గురైన సానియా మీర్జా
సానియాను పలువురు ప్రశంసించారు. సానియా మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ అన్నారు. మరో సానియా ఇప్పట్లో పుట్టడం కష్టమే అని సానియా అన్న మాట వాస్తవమేనన్నారు. సానియా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిందన్నారు. క్రీడా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అవసరమని అజారుద్దీన్ అన్నారు. ఏమాత్రం ఫిట్‌నెస్ కోల్పోయినా, ఒకట్రెండు ఓటములు వచ్చినా మీడియా, సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారన్నారు. సానియా లెజెండ్ అని భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు.