పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. అల్లు అర్జున్ అంశంను గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారన్నారు. సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయని, ఘటన జరిగిన రెండో రోజే వెళ్లి మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం, మర్యాదతో వ్యవహరించిందని.. సినిమా విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సాహం ఇచ్చారని పవన్ ప్రశంసించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్టు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడారు. ‘తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు. కింది స్థాయి నుంచి ఎదిగారు. సీఎం రేవంత్ బెనిఫిట్‌షోలకు అవకాశం ఇచ్చారు. టికెట్ ధర పెంపునకూ వెసులుబాటు కల్పించారు. సీఎం సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయి. పుష్ప 2 సినిమాకు సీఎం రేవంత్ పూర్తిగా సహకరించారు. టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం, మర్యాదతో వ్యవహరించింది. అల్లు అర్జున్ విషయంలో ముందు, వెనుక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. అయితే ఒకటి మాత్రం చెప్పగలను.. చట్టం అందరికీ సమానం. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టలేం. వారు ఎప్పుడోఒ భద్రత గురించే ఆలోచిస్తారు’ అని డిప్యూటీ సీఎం అన్నారు.
‘ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది. గోటితో పోయే దాన్ని.. గొడ్డలి వరకూ తెచ్చారు. మేము అండగా ఉన్నామని బాధిత కుటుంబానికి ముందే చెప్పి ఉండాల్సింది. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సింది. సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయి. రెండో రోజే వెళ్లి మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదు. ప్రతి హీరో తన సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటారు. అభిమానులకు అభివాదం చేయాలనే ఆలోచన ప్రతి హీరోకు ఉంటుంది. ఈ సమస్యలో హీరోను ఒంటరి చేశారు. అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం కూడా కరెక్ట్ కాదు’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.