Sajjala Ramakrishna Reddy: స్కిల్ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నేరం జరగలేదగని చంద్రబాబు నిరూపించగలరా అంటూ ప్రశ్నించారు. ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేశారని మండిపడ్డారు. సీమెన్స్ సంస్థ కూడా తమకు సంబంధం లేదని చెప్పిందని వెల్లడించారు. సీమెన్స్ సంస్థ 3 వేల కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఇస్తామన్న డబ్బు ఎటు వెళ్ళిందని ప్రశ్నించారు. రూ. 300 కోట్లకుపైగా ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ స్కాంలో చంద్రబాబును సాక్ష్యాధారాలతోనే అరెస్ట్ చేశారని సజ్జల పేర్కొన్నారు. అన్ని ఆధారాలతోనే సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసిందన్నారు. ఫేక్ ఇన్వాయిస్‌తో నిధులు పక్కదారి పట్టించారని.. అన్ని వేళ్లు చంద్రబాబు వైపే చూపిస్తున్నాయన్నారు. ఈడీ కూడా నలుగురిని అరెస్ట్ చేసిందని.. ఈ స్కామ్‌కు సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే అంటూ ఆయన అన్నారు. చంద్రబాబు అరెస్టులో కక్షసాధింపు ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు.
Also Read: Chandrababu: చంద్రబాబుకు హైకోర్టులో ఊరట
“కోర్టు కూడా జ్యుడీషియల్ రిమాండ్ కావాలని భావించింది. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య కేసులు విచారణకు రాకుండా అడ్డుకోవటం ఎలా అన్నదే. టిడ్కో హౌసింగ్ కాంట్రాక్టులు ఇచ్చినందుకు కోట్లాది రూపాయల ముడుపులు అందాయని ఐటీ నోటీసులు ఇచ్చింది. ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌కు చంద్రబాబు పరిధులు చెబుతున్నాడు. పెండ్యాల శ్రీనివాస్, పార్థసాని ఇద్దరూ రాత్రికి రాత్రి దేశం వదిలి పారిపోయారు. సాక్షులను చంద్రబాబు దేశాలను దాటించగలడు అని తేలుతుంది. స్కాంలలో సూత్రధారి, పాత్రధారి, లబ్దిదారుడు చంద్రబాబు. ఇన్నేళ్ళు సాంకేతిక అంశాలు చూపిస్తూ తప్పించుకున్నాడు. స్కిల్ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. బరితెగించి ప్రజల సొమ్ము పక్కదారి పట్టించాడు. పట్టపగలు నిలువు దోపిడి చేశారు. కుంభకోణాల్లో ఇది ఒక క్లాసిక్ కేసు. 3300 కోట్ల ప్రాజెక్టులో క్యాబినెట్ నిర్ణయం అంటున్నారు. దీనిలో రూ.3000 కోట్లు ఎగిరి పోయినా క్యాబినెట్ నిర్ణయం అనే పేరుతో వదిలేయాలా? ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత గవర్నర్ సంతకం లేదు అంటే ఎలా??. దేశంలోనే అరుదైన కేసు ఇది. ధర్మకర్తే నిలువు దోపిడీ చేస్తే ఎలా చూడాలి??.రికార్డు స్థాయి మెజారిటీతో 2019లో గెలిచినప్పుడే అరెస్టు చేసి ఉంటే అప్పుడు కక్ష సాధింపు అనటానికి ఆస్కారం ఉండేది. ముఖ్యమంత్రి చెప్పినట్లు చంద్రబాబు జైల్లో ఉన్నా, బయట ఉన్నా తేడా ఏమీ లేదు. లోకేష్ ఎందుకు జనంలో తిరగటం లేదు. ఢిల్లీ ఎందుకు వెళుతున్నాడు??. జోకుల స్టేజ్ కూడా దాటిపోయి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు.”అని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.