KL Rahul registers his 10th consecutive win as Indian Captain: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జోహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 116 పరుగులకు ఆలౌట్ అయింది. ఆండిలే ఫెలుక్వాయో (33) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(5/37), ఆవేశ్ ఖాన్ (4/27) సఫారీ పతనాన్ని శాసించారు. దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సాయి సుదర్శన్ (55 నాటౌట్; 43 బంతుల్లో 9 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (52; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీలు చేశారు.
మొదటి వన్డేలో భారత జట్టును నడిపించిన కెప్టెన్ కేఎల్ రాహుల్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. వరుసగా అత్యధిక విజయాలు సాధించిన భారత మూడో కెప్టెన్‌గా రాహుల్ నిలిచాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. రాహుల్‌కు 10 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో వరుసగా విజయం సాధించగా.. ధోనీ 9 మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయాలు అందించాడు. రాహుల్ 2022 నుంచి 2023 వరకు తన కెప్టెన్సీలో భారత జట్టుకు వరుసగా 10 విజయాలు అందించాడు. మహీ 2013లో 9 మ్యాచ్‌ల్లో వరుస విజయాలు అందుకున్నాడు.
భారత కెప్టెన్‌గా అత్యధిక వరుస విజయాలు సాధించిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. 2019 నుంచి 2022 వరకు రోహిత్ వరుసగా 19 మ్యాచ్‌లు గెలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. 2018లో కెప్టెన్‌గా విరాట్ వరుసగా 12 మ్యాచ్‌లు గెలిచాడు. 2017లో కూడా విరాట్ సారథ్యంలో భారత జట్టు 12 మ్యాచ్‌లు గెలిచింది. తాజాగా ఈ జాబితాలోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో మిగిలిన రెండు వన్డేల్లో భారత్ గెలిస్తే విరాట్ రికార్డును రాహుల్ సమం చేస్తాడు. 2023లో కూడా రోహిత్ భారత్‌ను వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయతీరాలకు చేర్చాడు.