India-Russia: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ప్రపంచాన్ని ‘‘ఇంధన సంక్షోభం’’ లోకి నెట్టింది. భారత్‌తో సహా అన్ని దేశాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇంధనాన్ని పొదుపుగా వాడాలని ప్రధాని నరేంద్రమోడీ చెబుతున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానితో సహా, రక్షణ మంత్రి, పలు రాష్ట్రాల సీఎంలు తమ కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు.
ఇలాంటి సంక్షోభం మధ్య మరోసారి మిత్రదేశం రష్యా భారత్‌కు అండగా ముందుకు వచ్చింది. ఇంధన సరఫరాకు సంబంధించిన అన్ని ఒప్పందాలు ఏ పరిస్థితుల్లోనైనా నెరవేర్చబడుతాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. భారతదేశ ప్రయోజనాలకు ఏ విధంగా హాని కలిగించకుండా రష్యా చూసుకుంటుందని లావ్రోవ్ హామీ ఇచ్చారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కోసం ఆయన భారత పర్యటనకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-రష్యా సంబంధాలు అత్యంత బలంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇరు దేశాల మధ్య గాఢమైన స్నేహం ఉందని చెప్పారు. భారత్-రష్యలు విడిపోయే పరిస్థితి ఏదీ తలెత్తదని అన్నారు.
Read Also: Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
ఇంధన సరఫరా విషయంలో భారతదేశానికి రష్యా తన బాధ్యతల్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదని చెప్పారు. రష్యా సరఫరా వల్ల భారత ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగదని తాను హామీ ఇస్తున్నానని, అన్యాయమైన, నిజాయితీ లేని పోటీ మన ఒప్పందాలకు హాని కలిగించకుండా ఉండేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని, భారత్‌కు గ్యాస్, చమురు, బొగ్గు వంటి హైడ్రోకార్బన్లను సరఫరా చేస్తూనే ఉన్నామని, భవిష్యత్తులో ఈ సహకారం మరింత బలపడుతుందని చెప్పారు.
కొన్ని శక్తులు రష్యా-భారత్ సంబంధాలను దెబ్బతీసి తమ నియమాలను రద్దుడానికి ప్రయత్నిస్తూన్నాయని, అయితే వారి ప్రయత్నాలు విఫలమవుతాయని లావ్రోవ్ అన్నారు. రెండు దేశాలు వీటిని గమనిస్తున్నాయని, ఇదే తమ స్నేహాన్ని మరింత బలంగా చేస్తుందని చెప్పారు. రష్యా సాంకేతికతతో తమిళనాడు కుడంకుళంలో నిర్మిస్తున్న అణు విద్యుత్ కేంద్రం తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ శక్తివంతమైన నేతగా ఆయన అభివర్ణించారు.
