Rohit Sharma Says Iam not happy with my batting against Nepal in Asia Cup 2023: నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ సంతోషంగా లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఫీల్డింగ్ నాసిరకంగా ఉందని, తప్పకుండా మెరుగుపర్చుకుని సూపర్-4లో బరిలోకి దిగుతామన్నాడు. ఆసియా కప్ 2023 కోసం వచ్చేటప్పటికే ప్రపంచకప్ 2023 జట్టు ఎలా ఉండాలో ఓ అంచనాకు వచ్చామని రోహిత్ తెలిపాడు. సోమవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత్.. ఆసియా కప్‌లో సూపర్ -4కి చేరిపోయింది.
మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘నేపాల్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. నిజాయతీగా చెప్పాలంటే సంతోషంగా లేదు. ఆరంభం కాస్త నిదానంగా చేయాల్సి వచ్చింది. అయితే క్రీజ్‌లో కుదురుకున్నాక పరుగులు చేయడం తేలిక అయింది. షార్ట్ ఫైన్ లెగ్, డీప్ బ్యాక్ వర్డ్, స్క్వేర్ లెగ్ వైపు షాట్లు అప్పటికప్పుడు అనుకొని కొట్టాను. ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేవు. శ్రీలంక వచ్చేటప్పటికే ప్రపంచకప్ 2023 కోసం బరిలోకి దిగే జట్టుపై ఓ అంచనాకు వచ్చాం. ఇప్పుడున్న జట్టు నుంచే ఒకరిద్దరిని పక్కన పెట్టే అవకాశం ఉంది’ అని తెలిపాడు.
Also Read: Asia Cup 2023: సూపర్-4కు భారత్ అర్హత.. ఇండో-పాక్ మ్యాచ్ మళ్లీ ఎప్పుడంటే?
‘ఆసియా కప్ 2023లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచులపై జట్టు ఎంపిక ఆధారపడి ఉండదు. ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. రెండో మ్యాచ్‌లో పూర్తిస్థాయి ఓవర్లు సంధించాం. అయితే రెండింట్లో మేం అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించలేకపోయాం. కొందరు ప్లేయర్స్ చాలా రోజుల తర్వాత ఆడాడు. లీగ్ స్టేజ్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ ఒత్తిడికి గురైంది. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ జట్టును ఆదుకున్నారు. నేపాల్ మ్యాచ్‌లో మా బౌలింగ్ ఫర్వాలేదు. ఫీల్డింగ్ మాత్రం నాసిరకంగా ఉంది. తప్పకుండా అన్ని విభాగాలను మెరుగుపర్చుకుని సూపర్-4లో బరిలోకి దిగుతాం’ అని రోహిత్ చెప్పాడు.