ముంబై నుంచి చెన్నై వెళ్తున్న చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ దోపిడీ జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు రైలు బోగీల్లోకి ప్రవేశించి.. ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
దుండగులు పథకం ప్రకారం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే సిగ్నల్ వ్యవస్థకు చెందిన కేబుల్‌ను కత్తిరించారు. దీంతో సిగ్నల్ అందక చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది. రైలు ఆగిన వెంటనే దుండగులు బోగీల్లోకి ప్రవేశించి.. ప్రయాణికులను కత్తులతో బెదిరించారు. ప్రయాణికుల వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. అనంతరం దుండగులు పరారయ్యారు. ఈ ఘటనపై బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. 22159 రైల్లో యస్-1 భోగిలో గుత్తికి చెందిన విశాలాక్షి అనే మహిళ మెడలో నుంచి సుమారు 27 గ్రాముల బంగారు చైన్‌ను దుండగులు లాక్కెళ్లారు.
Also Read: AP Cabinet Sub Committee: నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చ!
మరోవైపు చెన్నై ఎగ్మోర్ ట్రైన్ (17654)లో దొంగలు హల్చల్ చేశారు. క్రాసింగ్ కోసం రామలింగయ్య పల్లి రైల్వే స్టేషన్‌లో ఎగ్మోర్ ట్రైన్ ఆగగా.. ట్రైన్ కదిలే సమయంలో దివ్యభారతి అనే ప్యాసింజర్ మెడలో ఉన్న 30 గ్రాముల బంగారు గోలుసును ఓ దొంగ లాక్కెళ్లాడు. దివ్యభారతి మాత్రమే కాదు మరికొందరిని మెడల్లో నుంచి కూడా బంగారు గోలుసులు లాక్కెళ్లారని తెలుస్తోంది. బాధితులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.