Rob Jetten: నెదర్లాండ్స్ రాజకీయ చరిత్రలో ఒక పెద్ద మార్పు జరగబోతోంది. దేశంలో అక్టోబర్ 29న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో D66 పార్టీ భారీ విజయం సాధించింది. దీంతో డచ్ సెంట్రిస్ట్ పార్టీ D66 నాయకుడు, 38 ఏళ్ల రాబ్ జెట్టెన్ దేశంలో మొట్టమొదటి బహిరంగ స్వలింగ సంపర్కుడు, అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి కానున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విజయం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. “ఈ ఎన్నికల్లో మనం అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది D66 కి చారిత్రాత్మక ఫలితం, కానీ దానితో పాటు గొప్ప బాధ్యత కూడా మనపై ఉంది” అని అన్నారు.
READ ALSO: Mexico: మెక్సికో సూపర్ మార్కెట్‌లో భారీ పేలుడు.. 23 మంది మృతి
హోరాహోరీగా ఎన్నికలు..
దేశంలో జరిగిన ఈ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. కానీ జెట్టెన్ ఇస్లాం వ్యతిరేక నాయకుడు గీర్ట్ వైల్డర్స్‌ను ఓడించాడు. ఈ ఎన్నికల్లో వైల్డర్స్ వలస వ్యతిరేకత, ఖురాన్‌పై నిషేధం వంటి అంశాలపై ప్రచారం చేశాడు. కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు గతంతో పోల్చితే ప్రజాదరణ గణనీయంగా తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. విదేశాల్లో నివసిస్తున్న డచ్ పౌరుల ఓట్లను లెక్కించిన నవంబర్ 3న తుది ఫలితం ప్రకటించనున్నారు.
ఇది సాధ్యమే..
దేశంలో రెండేళ్ల క్రితం D66 పార్టీ ఐదవ స్థానంలో ఉండేది. కానీ జెట్టెన్ తన వ్యూహం, సానుకూల ఆలోచనతో పార్టీని అధికార శిఖరానికి తీసుకెళ్లాడని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నినాదం “అవును మనం చేయగలం” నుంచి ప్రేరణ పొంది జెట్టెన్, ఈ ఎన్నికల్లో తన నినాదంగా ‘ఇది సాధ్యమే’ అని ప్రకటించారు. జెట్టెన్ మాట్లాడుతూ.. గీర్ట్ వైల్డర్స్ సమాజంలో ద్వేషాన్ని, విభజనను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. “మీరు మీ దేశానికి సానుకూల సందేశాన్ని తీసుకువెళితే ప్రజాకర్షక శక్తులను ఓడించవచ్చని మేము యూరప్, ప్రపంచానికి చూపించాము” అని జెట్టెన్ పేర్కొన్నారు. “గత కొన్ని సంవత్సరాలుగా నెదర్లాండ్స్‌లో చాలా ప్రతికూలత ఉన్నందున మేము చాలా సానుకూల ప్రచారాన్ని నిర్వహించాము. ఇప్పుడు ఆ వాతావరణాన్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైంది” అని జెట్టెన్ అన్నారు. “యూరోపియన్ మద్దతు లేకుండా మనం శూన్యం కాబట్టి, నెదర్లాండ్స్ తిరిగి యూరప్ మధ్యలో ఉండాలని నేను కోరుకుంటున్నాను” అని ఆయన చెప్పారు.
రాబ్ జెట్టన్ వ్యక్తిగత జీవితం..
రాబ్ జెట్టెన్ ఆగ్నేయ నెదర్లాండ్స్‌లోని ఉడెన్ నగరంలో జన్మించాడు. ఆయన నీమెయర్‌లోని రాడ్‌బౌడ్ విశ్వవిద్యాలయంలో ప్రజా పరిపాలనను అభ్యసించాడు. చిన్నతనంలో ఆయనకు ఫుట్‌బాల్, అథ్లెటిక్స్ అంటే మక్కువ ఎక్కువగా ఉండేది. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ పాఠశాల ఉపాధ్యాయులు. “నేను ఎల్లప్పుడూ ప్రపంచాన్ని కొంచెం మెరుగ్గా మార్చాలని కోరుకున్నాను” అని ఆయన చెప్పాడు. ఆయన మొదట్లో తన కెరీర్‌ను క్రీడల్లో లేదా హోటల్-రెస్టారెంట్ వ్యాపారంలో కొనసాగించాలనుకున్నాడు. “నేను వెచ్చని దేశంలో బీచ్‌లో నా స్వంత రెస్టారెంట్‌ను తెరవాలనుకున్నాను, కానీ జీవితం నన్ను వేరే దిశలో తీసుకెళ్లింది. అయితే, ఇప్పుడు నాకు నెదర్లాండ్స్‌లో అత్యంత అందమైన ఉద్యోగం ఉందని చెప్పగలను” ఆయన అన్నారు. అర్జెంటీనా హాకీ ఆటగాడు నికోలస్ కీనన్‌తో రాబ్ జెట్టన్ నిశ్చితార్థం జరిగింది. వీళ్లు వచ్చే ఏడాది స్పెయిన్‌లో వివాహం చేసుకోనున్నారు.
READ ALSO: Realme P3x 5G: Realme 5G ఫోన్ పై వేలల్లో డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ,50MP కెమెరా