తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. అయితే.. ఈ జూమ్ మీటింగ్‌కు జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. ఈ సందర్భంగా ఈ జూమ్ మీటింగ్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్ కొన్ని వివాదాస్పద అంశాలను చర్చకు పెట్టాయన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ఇరు పార్టీలు నాటకాలాడుతున్నాయని, గతంలో కూడా నయీమ్ కేసు, డ్రగ్స్ కేసు, ఆర్టీసీ కార్మికుల ధర్నాలను వివాదాస్పదం చేశారన్నారు. వెస్ట్ బెంగాల్ తరహా పాలిటిక్స్ తెలంగాణలో చేయాలనుకుంటున్నారని, పోల్ పోలరైజేషన్ కోసం బీజేపీ, టీఆర్‌ఎస్ డ్రామాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. దీనిపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ 47లక్షల మందికి 25వేల కోట్లు చెల్లించాల్సి ఉందని, ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు.
Also Read : Chiranjeevi-Balayya: చిరు, బాలయ్యలకు సొంత అడ్డాల్లో థియేటర్స్ తగ్గనున్నాయా?
పంట నష్టపోయిన రైతులకు పరిహారం 15లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వారికి ఇన్ పుట సబ్సిడీ ఇచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని రేవంత్ రెడ్డి అన్నారు. అసైన్డ్ భూములను సీలింగ్ ల్యాండ్ పేరుతో ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తోందని, పోడు భూముల సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ధాన్యం కొనుగోలు సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని, సీఎస్ కు ఈ సమస్యలపై రెప్రజెంటేషన్ ఇవ్వడంతో కార్యాచరణ ప్రారంభిద్దామన్నారు. అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, ఇందిరాపార్క్ వద్ద రెండు రోజుల దీక్ష కార్యక్రమం చేపట్టాలన్నారు. సోమవారం నుంచి డిసెంబర్ 5 లోపు ఈ కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు.