Devendra Fadnavis: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022లో తమ కూటమి అధికారంలోకి రావడానికి కారణం రెండు పార్టీల్లో చీలికని స్పష్టం చేశారు. ఆ చీలిక జరగడం వల్ల తనకు ఇద్దరు మిత్రులు లభించారని వివరించారు. ఆదివారం నాడు ముంబైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొని మాట్లాడారు. తన 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచార స్లోగన్ ‘ఐ విల్ బి బ్యాక్’ గురించి ప్రస్తావించారు.
ఫడ్నవీస్ మాట్లాడుతూ..” ఐ విల్ బి బ్యాక్ అంటూ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిచ్చాను. రెండోసారి అధికారంలోకి వస్తామని భావించాం. కానీ అది సాధ్యపడలేదు. మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ కూటమిని చీల్చి అధికారంలోకి వచ్చాం. ఇదంతా చేయడానికి రెండున్నరేళ్లు పట్టింది. రెండు పార్టీల్లో చీలిక ద్వారా అధికారం చేపట్టడం సాధ్యం అయ్యింది. దాంతో తనకు ఇద్దరు మంచి మిత్రులు దొరికారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ లాంటి ఇద్దరు ప్రాణ స్నేహితులు లభించారు .” అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. 2019 ఎన్నికల్లో ‘బీజేపీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకుంది. శివసేనతో (2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ ఠాక్రే మాకు ద్రోహం చేశారు. ఫలితంగా మేం ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది’ అని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు.
Read Also: Satyendar Jain: సత్యేందర్ జైన్‌కు బెయిల్ తిరస్కరణ.. వెంటనే లొంగిపోవాలని సుప్రీం ఆదేశం
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మహా వికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ఎంపికయ్యారు. అయితే, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మహా వికాస్ అఘాడీ కూటమి కుప్పకూలింది. శివసేన అధినేత ఉద్దవ్ థాకరే మీద ఏక్‌నాథ్ షిండే 2022 జూన్‌లో తిరుగుబాటు చేశారు. బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాంతో శివసేన చీలింది. షిండే ముఖ్యమంత్రి పదవీ చేపట్టగా, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. షిండే పార్టీని అసలైన శివసేన పార్టీగా భారత ఎన్నికల సంఘం గుర్తించింది. గత ఏడాది జూలై నెలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. అజిత్ పవార్ వర్గం మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరింది. అజిత్ పవార్ వర్గానిదే అసలైన ఎన్సీపీ అని ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. రెండు పార్టీల చీలికతో తనకు ఇద్దరు మంచి స్నేహితులు లభించారని ఫడ్నవీస్ అంటున్నారు.