Satyendar Jain: మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత సత్యేందర్ జైన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. మధ్యంతర బెయిల్‌పై ఉన్న జైన్‌ను వెంటనే లొంగిపోవాలని న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం కోరింది. వారం రోజుల్లోగా లొంగిపోయేందుకు అనుమతించాలంటూ జైన్ తరపు న్యాయవాది చేసిన మౌఖిక అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
Read Also: Supreme Court: ఎస్బీఐకి సుప్రీంకోర్టు చివరి గడువు.. ఎలక్టోరల్ బాండ్లపై ప్రతి రహస్యం చెప్పాల్సిందే !
జనవరి 17న, ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. వైద్య కారణాలపై 2023 మే 26న జైన్‌కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన అత్యున్నత న్యాయస్థానం దానిని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చింది. ఈ కేసులో తన రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును కొట్టివేస్తూ ఏప్రిల్ 6, 2023న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ జైన్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఆప్ నేత సత్యేందర్ జైన్‌ను 2022 మే 30న ఈడీ అరెస్టు చేసింది. ఆయనతో సంబంధం ఉన్న నాలుగు కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేశారని ఈడీ ఆరోపించింది. అవినీతి నిరోధక చట్టం కింద జైన్‌పై 2017లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా జైన్‌ను అరెస్టు చేసింది. ఈ ఆరోపణలను ఖండించిన జైన్‌కు సీబీఐ నమోదు చేసిన కేసులో ట్రయల్ కోర్టు 2019 సెప్టెంబర్ 6న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.