రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. టాటా కంపెనీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా ఐటీ విభాగాన్ని సంస్థకు మూలస్తంభంగా మార్చారు. తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన రతన్ టాటా.. వయో సంబంధిత సమస్యలతో బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రముఖులు అందరూ ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే అమెరికాలో ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రతన్.. భారత్‌కు రావాలని అనుకోలేదు.
పీటర్ కేసే అనే రచయిత గతంలో రతన్ టాటాను ఇంటర్వ్యూ చేశారు. రతన్ చెప్పిన విషయాలతో ఆయన ‘ది స్టోరీ ఆఫ్ టాటా-1868 టు 2021’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు. అందులో టాటా జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. రతన్‌ను ఆయన నాన్నమ్మ నవాజ్ భాయ్ ముంబైలోని కూపరేజ్ రోడ్ ప్రాంతంలో ఉన్న క్యాంపియన్ స్కూల్‌లో చేర్పించారు. బయటి ప్రపంచం చూడడం ఆయనకు అదే మొదటిసారి. స్కూల్ నుంచి తీసుకురావడానికి రతన్ నాన్నమ్మ ఓ పాతరోల్స్ రాయిస్ కారును పంపేవారు. దాంట్లో ఎక్కడానికి రతన్ సిగ్గుపడేవారు. అందుకే ఆయన ఇంటికి నడుచుకుంటూనే వెళ్లేవారు.
Also Read: Gold Rate Today: పండగ వేళ శుభవార్త.. తులం బంగారంపై ఎంత తగ్గిందంటే?
రతన్ టాటా అమెరికాలో ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ అనంతరం ఆయన భారత్‌కు రావాలనుకోలేదు. కానీ నాన్నమ్మపై ఉన్న ప్రేమే ఆయనను భారత్‌కు తిరిగి తీసుకొచ్చింది. నవాజ్ భాయ్ అనారోగ్యంతో ఉండడంతో రతన్ భారత్‌కు వచ్చారు. ఆమె దీర్ఘకాలం అనారోగ్యంతో ఉండడంతో రతన్ భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత టాటా గ్రూప్ వ్యాపారంలోకి ఆయన అడుగుపెట్టారు. వ్యాపారంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొంటూ.. భారత్‌లో దిగ్గజంగా మారారు.