తెలంగాణలోని పలు జిల్లాలో మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి వరకు భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరైన తెలంగాణ ప్రజలకు ఈ వర్షాలతో కాస్త ఉపశమనం కలిగింది. అయితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారేపల్లి మండల వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఖమ్మం నుండి ఇల్లందు వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు పై పెట్రోల్ బంకు సమీపంలో చెట్టు కొమ్మలు విరిగిపడడంతో బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా.. ఉప్పునుంతల మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అయితే.. మండల కేంద్రంలోని కొత్త రాంనగర్ లో పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందింది. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఈదురు గాలుల తో చిరు జల్లులు కురిశాయి. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉరుములు మెరుపులు తో తేలిక పాటి వర్షం కురిసింది.
Also Read : Naga Chaitanya: మా తాత.. ఎన్టీఆర్ గురించి ఇంట్లో అలా చెప్పేవారు
ఇదిలా ఉంటే.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం శాఖపూర్ గ్రామంలో కొబ్బరి చెట్టు పై పిడుగు పడింది. దీంతో చెట్టుపై మంటలు చెలరేగాయి. మంటల ధాటికి కొబ్బరి మట్టలు కింద పడిపోయాయి. మంటలు చెట్టుపై వ్యాపించాయి. మంటల్లో పచ్చికొబ్బరికాయలు కాలిపోయాయి. కొబ్బరి చెట్టుపై మంటలు చూసి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అయితే పిడుగు పడ్డ సమయంలో చుట్టూ ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. పిడుగుపడి దగ్ధమవుతున్న చెట్టు దృశ్యాలను ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
Also Read : KKR vs LSG : వరుస వికెట్లు కోల్పోతున్న లక్నో.. 10 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..?