ప్రధాని మోడీ పర్యటనలో ఏపీకి శుభవార్త వినిపించారు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఏయూ బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. సభకు అధ్యకత వహించిన అశ్వినీ వైష్ణవ్ నమస్కారం.. అంటూ తెలుగులో ప్రజలకు అభివాదం ద్వారా ప్రసంగం ప్రారంభించారు. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అద్భుత ప్రగతి సాధిస్తోంది. రైల్వే శాఖ ఆధునీకరణదిశగా దూసుకెళ్తోంది అన్నారు. మోడీ ఆశీస్సులతో ఏపీకి కూడా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రాబోతోంది.
గత 8 ఏళ్లుగా రైల్వే అభివృద్ధి పథంలో నడుస్తోందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైళ్లు, ప్లాట్‌ఫాంలు, సౌకర్యాల కల్పన మరింత పెరిగిందని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్‌లో అనేక మార్పులు వస్తున్నాయని వెల్లడించారు. రూ.446 కోట్లతో విశాఖ రైల్వే ఆధునీకరణ చేపట్టామని.. మోదీ నాయకత్వంలో వందేభారత్ రైలు కల సాకారమైందని పేర్కొన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా వందేభారత్ రైలు వస్తుందని ప్రకటించారు. 2014కు ముందు ఏపీకి రూ.986 కోట్లే వచ్చాయని.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రూ.7,032 కోట్లు వచ్చాయని తెలిపారు.
మోడీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన పనులు ఇవే
* రూ. 460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు
* రూ. 3,778 కోట్లతో రాయిపూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ హైవే
* రూ. 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు రోడ్డు నిర్మాణం
* రూ. 152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు
* రూ. 2658 కోట్లతో గెయిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంగుల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టుకు నిర్మాణ పనులకు శంకుస్థాపన
* రూ. 211 కోట్లతో నరసన్నపేట పాతపట్నం రహదారి అభివృద్ధి పనులు జాతికి అంకితం
* రూ. 2,917 కోట్లతో నిర్మించిన ఓఎన్‌జీసీ యు ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ జాతికి అంకితం