CPI Narayana: తెలంగాణలో పోటీ చెయ్యకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని.. కాంగ్రెస్‌ను అడిగినా సీట్లు ఇవ్వలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీకి మద్దతివ్వలేమని.. పొత్తులు, పోటీలపై మాకు స్పష్టమైన వైఖరి ఉందన్నారు. జాతీయస్థాయిలో ఇండియా కూటమిని బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి పొత్తులు, పోటీలు ఉంటాయన్నారు. కేరళలో ఎప్పటి నుంచో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే పోటీ నెలకొంటుందన్నారు. వయనాడ్‌లో రాహుల్‌గాంధీపై పోటీ చేస్తున్నామని.. వయనాడ్‌లో ఎప్పటి నుంచో పోటీ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌తో సర్దుబాట్లు కుదరని చోట విడిగా పోటీ చేస్తున్నామని వెల్లడించారు. కేరళలో ప్రత్యర్థులమే, ఇండియా కూటమిలో మిత్రులమన్నారు. బెంగాల్లో మమతపై కలిసి పోటీ చేస్తున్నామన్నారు. రేవంత్ కేరళకు వెళ్లి కేసీఆర్‌ను విమర్శించినట్లు విజయన్‌పై మాటలేంటని ప్రశ్నించారు. సీఎం విజయన్‌పై రేవంత్ వ్యక్తిగత వ్యాఖ్యలు సరైందేనా అంటూ ప్రశ్నలు గుప్పించారు. రేవంత్ చుట్టే బోలెడు కేసులున్నాయన్నారు. లెఫ్ట్‌ను విమర్శించినప్పుడు రాజకీయాలు మాట్లాడాలని సలహా ఇచ్చారు.
Read Also: Pawan Kalyan: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం
సర్దుబాట్లు కుదరని చోట్ల పోటీ చేయకుండా ఉండడానికి మేం సన్యాసులమా అని ఆయన అన్నారు. విజయన్ నిజంగా తప్పు చేసుంటే ఇప్పటికే జైల్లో వేసే వారు కదా అని వ్యాఖ్యానించారు. విజయన్‌పై కేసు రాజకీయ ప్రేరేపితమేనని ఆయన కొట్టిపడేశారు. కేజ్రీవాల్‌ను జైల్లో వేసినప్పుడు విజయన్‌కు కూడా జైల్లో వేసేవారు కదా అంటూ ప్రశ్నించారు. కేజ్రీవాల్‌ను జైల్లో వేశారు కాబట్టే.. కవితను జైల్లో వేశారని సీపీఐ నారాయణ అన్నారు. ఎంఐఎం ప్రాబల్యమున్న పాతబస్తీని ఒక ప్రత్యేక దేశంలో వదిలేశారని.. ఓల్డ్ సిటీలో ప్రభుత్వ వ్యవస్థలు పని చెయ్యవన్నారు. ఎంఐఎంకు మోడీ ఆశీస్సులు ఉన్నాయని ఆరోపించారు. మోడీ, ఎంఐఎంల దోస్తానా జిగిరీ దోస్తానా అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నో అరాచకాలకు పాల్పడే ఎంఐఎం నేతలపై ఒక్క కేసూ ఎందుకు లేదని ప్రశ్నించారు. రాజ్యాంగ స్ఫూర్తికి నరేంద్ర మోడీ తూట్లు పొడుస్తున్నారని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌తో మాకు ఎలాంటి సంబంధాల్లేవని తెలిపారు సీపీఐ నారాయణ. మేనిఫెస్టో అమలు చెయ్యని పార్టీలపై ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు.