Bade Chokkarao : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ కాంకేర్, మారేడుబాక అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు (Bade Chokkarao) మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, మావోయిస్టు పార్టీ ఈ ప్రచారాన్ని ఖండించింది. దామోదర్ మృతిచెందలేదని, ఆయన క్షేమంగా ఉన్నారని స్పష్టం చేస్తూ ఒక లేఖ విడుదల చేసింది. ఈ లేఖను సౌత్ జోన్ కమిటీ కార్యదర్శి సోమ్ తేర్ సమత పేరుతో విడుదల చేశారు.
ఈ సందర్భంగా మావోయిస్టు పార్టీ పోలీసులపై తీవ్ర విమర్శలు గుప్పించింది. పోలీసులు కావాలనే బూటకపు లేఖలు తయారు చేసి, ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఎనిమిది మంది మృతి చెందినట్లు లేఖలో పేర్కొంది. వారిలో నలుగురు మావోయిస్టులు, మిగతా నలుగురు గ్రామస్తులని వెల్లడించింది. పోలీసులు అనవసరంగా గ్రామాల్లోకి చొరబడి, అమాయక ప్రజలను బెదిరించడమే కాకుండా, దాడులకు పాల్పడుతున్నారని విమర్శించింది.
మావోయిస్టు పార్టీ ప్రకటనలో “ఆపరేషన్ కగార్” పేరిట కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు చేపట్టిన చర్యలను తీవ్రంగా ఖండించింది. జనవరి 16, 17 తేదీల్లో దాదాపు 8,000 మంది భద్రతా బలగాలు చుట్టుపక్కల నాలుగు గ్రామాలపై దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ దాడుల సమయంలో భద్రతా బలగాలు అమాయక గ్రామస్థులను టార్గెట్ చేసి, వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
దామోదర్ తన సహచరులతో ఇటీవల ఫోలన్ ద్వారా మాట్లాడినట్లు తెలిపిన మావోయిస్టు పార్టీ, తాను క్షేమంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారని పేర్కొంది. కాగా, ఈ విషయంపై ఏబీఎన్ ఛానెల్ మొదట వార్తలు ప్రసారం చేసినట్లు గుర్తు చేసింది.
మరోవైపు, భద్రతా బలగాలు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో అనవసర ఒత్తిడి సృష్టిస్తున్నాయని, ఇది ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మావోయిస్టు పార్టీ తన ప్రకటనలో అభిప్రాయపడింది. పోలీసుల ప్రకటనలన్నీ బూటకపు ప్రకటనలేనని, నిజాలను మలుపుతిప్పి ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.
మొత్తంగా, పూజార్ కంకేర్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన భద్రతా బలగాల చర్యలపై మావోయిస్టు పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ నాయకుడు దామోదర్ భద్రంగా ఉన్నారని, ఎలాంటి అపోహలు వద్దని స్పష్టం చేసింది.